ఫ్యాక్టరీ యజమాని దగ్గర పనిచేస్తున్న ఓ ఉద్యోగి రూ.25లక్షల నగదుతో అదృశ్యమయ్యాడు.
హైదరాబాద్: ఫ్యాక్టరీ యజమాని దగ్గర పనిచేస్తున్న ఓ ఉద్యోగి రూ.25లక్షల నగదుతో అదృశ్యమయ్యాడు. రాంగోపాల్‌పేట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పరారైన వ్యక్తి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. పోలీసుల కథనం ప్రకారం... ఫలక్‌నుమా శంషేర్‌గంజ్ ప్రాంతానికి చెందిన చంద్రమోహన్ బెరీ(42) గత పదేళ్లుగా డీవీ కాలనీకి చెందిన సుమిత్ సింగాల్ వద్ద పనిచేస్తున్నాడు. సుమీత్‌కు పటాన్‌చెరులో పలు పరిశ్రమలు ఉన్నాయి.
వ్యాపార లావాదేవీల్లో భాగంగా ఏప్రిల్ 19వ తేదీన హైటెక్ సిటీలో ఉండే ప్యాక్టరీ మేనేజర్ పురుషోత్తంకు రూ.25లక్షల నగదు అందించాలని చంద్రమోహన్ బేరికి యజమాని పురమాయించాడు. సాయంత్రం 7.30గంటలకు నగదు ఉండే బ్యాగును ఇచ్చి ఇంటి నుంచి పంపించాడు. ద్విచక్ర వాహనంపై సింధీ కాలనీ నుంచి బయల్దేరిన చంద్రమోహన్ బెరీ మొబైల్ ఫోన్ 15 నిమిషాలకే స్విచ్ ఆఫ్ అయింది. అప్పటి నుంచి చంద్రమోహన్ ఆచూకీ లభించలేదు. యజమాని సుమీత్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి ప్రత్యేకంగా గాలింపు చర్యలు చేపట్టారు. చంద్రమోహన్ కిడ్నాప్‌కు గురయ్యాడా, డబ్బుతో పరారయ్యాడా అన్న కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.