ఖరీదైన కార్ల చోరీ, అమ్మాయిలతో షికార్లు
హైదరాబాద్ : జల్సాలకు అలవాటుపడ్డ ఓ ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ ఖరీదైన కార్లను చోరీ చేసి వాటిలో అమ్మాయిలతో షికార్లు చేస్తున్నాడు. అతగాడిని జూబ్లీహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం... శ్రీనగర్ కాలనీకి చెందిన సుమన్(25) ఇంజినీరింగ్ పూర్తి చేశారు. చదువుతున్న సమయంలోనే అమ్మాయిలతో పరిచయాలు, విలాసాలకు అలవాటుపడ్డాడు. విలాసాలకు అవసరమైన డబ్బు లేకపోవడంతో కార్ల చోరీలు మొదలెట్టాడు.
వారం క్రితం జూబ్లీహిల్స్‌లోని దసపల్లా హోటల్ పార్కింగ్‌లోని వ్యాలెట్ పార్కింగ్ డ్రా నుంచి ఓ కారు తాళం తీసుకొని ఓ అడ్వకేట్ కు చెందిన బీఎండబ్ల్యూ కారు ఎత్తుకెళ్లాడు. అదే రోజు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు దసపల్లా హోటల్ సీసీ కెమెరాల పుటేజీల ఆధారంగా సుమన్‌ను అదుపులోకి తీసుకొని విచారించగా గతంలో కూడా బేగంపేట బాటిల్స్ అండ్ చిమ్నీ పబ్ పార్కింగ్‌లో కూడా రెండు వెర్నా కార్లు దొంగిలించినట్లు తేలింది.
కార్లు చోరీ చేశాక వాటి నంబర్ ప్లేట్లు మార్చి అమ్మాయిలతో షికార్లుకు వెళ్లడం, పబ్‌లు, క్లబ్‌లలో జల్సాలు చేయడం సుమన్‌కు అలవాటుగా మారింది. గతంలో ఇంకా ఏమైనా చోరీలు చేశాడా? అనే కోణం నిందితుడిని పోలీసులు విచారిస్తున్నట్టు తెలిసింది.