1,606 స్కూళ్లలో ఒక్క టీచరూ లేరు!
- అత్యధికంగా ఆదిలాబాద్ జిల్లాలో 437 పాఠశాలలు
- 40 శాతం స్కూళ్లలో 40 మంది లోపే విద్యార్థులు
- పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యపై లెక్కలు తేల్చిన విద్యాశాఖ
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో 25,736 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా.. 10,515 స్కూళ్లలో(దాదాపు 40%) ఒక్కో దాంట్లో 40 మంది లోపే విద్యార్థులు ఉన్నారు. 1,606 ప్రభుత్వ పాఠశాలలకు ఒక్క టీచర్ కూడా లేరు. 100 మందికి పైగా విద్యార్థులున్న ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు 3,778 ఉండగా మిగతా పాఠశాలల్లో అంతకంటే తక్కువే ఉన్నారు. ఇందులో 41 నుంచి 100 మందిలోపు విద్యార్థులు ఉన్న స్కూళ్లు 722 ఉన్నాయి. రాష్ట్రంలో పాఠశాలలు, వాటిలో విద్యార్థుల సంఖ్యపై విద్యాశాఖ జరిపిన అధ్యయనంలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. గతనెల 30వ తేదీ వరకు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యకు సంబంధించిన సమాచారాన్ని విద్యాశాఖ సేకరించింది. ఒక్క టీచర్ కూడా లేని పాఠశాలలు అత్యధికంగా ఆదిలాబాద్ జిల్లాలో 437 ఉన్నాయి.
ఇలాంటివే నిజామాబాద్‌లో 108, కరీంనగర్‌లో 90, వరంగల్‌లో 86, ఖమ్మంలో 141, నల్లగొండలో 109, మహబూబ్‌నగర్‌లో 47, రంగారెడ్డిలో 267, మెదక్‌లో 321 స్కూళ్లు ఉన్నాయి. వాటికి ఇప్పటికిప్పుడే రెగ్యులర్ టీచర్లను ఇచ్చే పరిస్థితి లేనందున విద్యా వలంటీర్ల నియామకానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వీటితోపాటు టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్న మరో స్కూళ్లలోనూ 9,335 మంది విద్యా వలంటీర్లతో బోధనకు చర్యలు చేపట్టింది.
బోధనపై దృష్టి పెట్టని టీచర్లు
పాఠశాలల్లో విద్యా బోధన ఎలా సాగుతోందన్న అంశంపై గతేడాది విద్యాశాఖ రంగారెడ్డి, హైదరాబాద్, మెదక్, నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాల్లో అంతర్గత సర్వే నిర్వహించింది. దాని ప్రకారం.. టీచర్లు శ్రద్ధ పెట్టి పని చేయడం లేదని తేలింది. పాఠ్య పుస్తకాల్లోని ముందుమాట కూడా సరిగ్గా చదవడం లేదని వెల్లడైంది. ఇలాంటి పరిస్థితులను చక్కదిద్దేందుకు విద్యాశాఖ సన్నద్ధం అవుతోంది. ఈ విద్యా సంవ త్సరంలో పక్కా బోధనకు అవసరమైన శిక్షణను టీచర్లకు ఇవ్వాలని నిర్ణయించింది.