రెండు వేల బడులు మూత!
ఒక్క విద్యార్థీ లేని 405 స్కూళ్లకు తాళం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సుమారు 2 వేల ప్రభుత్వ స్కూళ్ల మూసివేతకు రంగం సిద్ధమవుతోంది! విద్యార్థుల్లేని స్కూళ్లను రద్దు చేయడంతోపాటు విద్యార్థులు తక్కువగా ఉన్న స్కూళ్లను సమీప పాఠశాలల్లో విలీనం చేసేందుకు విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. ప్రభుత్వ ఆమోదం లభించిన వెంటనే పాఠశాలల హేతుబద్ధీకరణకు చర్యలు చేపట్టనుంది. ఈ వేసవి సెలవుల్లోనే ప్రక్రియను పూర్తి చేయాలని భావిస్తోంది. దీంతో ఒక్క విద్యార్థి కూడా లేని 405 స్కూళ్లు మూతపడనుండటంతోపాటు మరో 1,500పైగా స్కూళ్లు సమీపంలోని స్కూళ్లలో విలీనం కావడంతో రద్దయ్యే అవకాశం ఉంది.
వృథా అవుతున్న మానవవనరులు
ఉన్నత పాఠశాల స్టాఫ్ ప్యాటర్న్ ప్రకారం దాన్ని కొనసాగించాలంటే కనీసం 100 మంది విద్యార్థులు ఉండాలి. కానీ రాష్ట్రంలో వంద కంటే తక్కువ మంది విద్యార్థులతో 770 ఉన్నత పాఠశాలు కొనసాగుతున్నాయి. వాటిల్లో 8 మంది టీచర్లు, ఒక ప్రధానోపాధ్యాయుడు చొప్పున సిబ్బంది పని చేస్తున్నందున మానవ వనరులు వృథా అవుతున్నాయని విద్యాశాఖ భావిస్తోంది. మరోవైపు 30 మందిలోపు ఉన్న మొత్తం పాఠశాలలు 12,813 వేల వరకు ఉంటే అందులో ప్రాథమిక పాఠశాలలే 7,060 ఉన్నాయి. వాటి నిర్వహణ కూడా భారంగా మారిందని విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి. కానీ విద్యా హక్కు చట్టం ప్రకారం అవాస ప్రాంతానికి కిలోమీటర్ పరిధిలో ప్రాథమిక పాఠశాలను అందుబాటులో ఉంచడంతోపాటు పిల్లలు లేకపోయినా లేదా కొందరు విద్యార్థులే ఉన్నా ఇద్దరు టీచర్ల చొప్పున కేటాయిం చాల్సి వస్తోంది. అం దుకే విద్యాశాఖ కిలోమీటరు నిబంధనను మార్చాలని యోచిస్తోంది. కొద్దిమంది పిల్లలు ఉన్న స్కూళ్లను సమీప పాఠశాలల్లో విలీనం చేసి రవాణా సదుపాయం కల్పించాలనుకుంటోంది.
ప్రాథమికోన్నతానికి మంగళం
వచ్చే విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రంలో రెండు రకాల పాఠశాల విధానాన్నే తీసుకురావాలని విద్యాశాఖ భావిస్తోంది. ప్రాథమికోన్నత పాఠశాలల విధానాన్ని రద్దు చేసి ప్రాథమిక, ఉన్నత పాఠశాలల విధానాన్నే కొనసాగించాలనుకుంటోంది. అయితే ప్రస్తుతం ఉన్న 1,276 ప్రాథమికోన్నత పాఠశాలల్లో చాలా వరకు సమీపంలోని ఉన్నత పాఠశాలల్లో విలీన ం కానున్నాయి. ఆవాస ప్రాంతానికి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్నత పాఠశాల లేకపోతే కొన్ని ప్రాథమికోన్నత పాఠశాలలను ఉన్నత పాఠశాలలుగా అప్‌గ్రేడ్ చేయనున్నారు. ఇప్పుడున్న ప్రాథమికోన్నత పాఠశాలల్లో కేవలం ఇద్దరు చొప్పున ఉపాధ్యాయులే ఉన్నారు. వారిలో ఒకరు గణితం, సామాన్య శాస్త్రం బోధిస్తుంటే.. మరొకరు సాంఘికశాస్త్రం, ఆంగ్లం బోధిస్తున్నారు. అయితే సామాన్య శాస్త్రం బోధించే టీచర్ గణితం బోధించడం వల్ల ఆశించిన ప్రయోజనం చేకూరడం లేదు. అందుకే వాటి విలీనంపై విద్యాశాఖ దృష్టి పెట్టింది.