నయీమ్‌కు మాజీ మంత్రి అండదండలు
రాజకీయ శత్రువుల అంతానికి నయీమ్‌ను వాడుకున్న మంత్రి
అనుమానిస్తున్న ఇంటెలిజెన్స్ వర్గాలు వివరాలన్నీ సీఎం దృష్టికి..
హైదరాబాద్: గ్యాంగ్‌స్టర్ నయీమ్ టీడీపీ హయాంలోనే తన నేర సామ్రాజ్యాన్ని విస్తరించినట్టు రూఢీ అయింది. నయీమ్ రాసుకున్న డైరీ, దొరికిన ఫోన్లు, కాల్ డేటాను విశ్లేషించిన ఇంటెలిజెన్స్ వర్గాలు.. టీడీపీ హయాంలో నయీమ్‌కు ప్రభుత్వ అండదండలు లభించినట్లు అనుమానిస్తున్నాయి. ఇప్పటికే దీనిపై కొన్ని ఆధారాలు సేకరించాయి. టీడీపీ హయాంలో ఓ మంత్రి నయీమ్‌కు సహకరించారని.. రాజ కీయ, అజ్ఞాత శత్రువులను అంతం చేసేందుకు నయీమ్‌ను ఆయుధంగా వాడుకున్నారని విచారణ బృందం గుర్తించింది. టీడీపీకి చెందిన ఆ మాజీ మంత్రితో ఇప్పటికీ నయీమ్‌కు మంచి సంబంధాలున్నాయని, తరచుగా ఫోన్లలో మాట్లాడినట్లుగా కాల్ డేటాను సేకరించారు.
ఆ మాజీ మంత్రి అనుచరులే చాలా కాలం నుంచి నయీమ్ అనుచరులుగా చెలామణిలో ఉన్నట్లు పోలీసు అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి సహకారాన్ని, టీడీపీ ప్రభుత్వంలో నయీమ్‌కు ఉన్న అండదండల వివరాలన్నీ ఇంటెలిజెన్స్ వర్గాలు బుధవారం సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. దీంతో నయీం గుట్టు రట్టు చేసే క్రమంలో ఈ కేసులో మాజీ మంత్రిని సైతం చేరుస్తారా అన్నది హాట్ టాపిక్‌గా మారింది.