తెలంగాణ టీడీపీలో కలహాలు | Fight in the telangana TDP | Sakshi
Sakshi News home page

తెలంగాణ టీడీపీలో కలహాలు

Published Sun, Jul 10 2016 4:31 AM | Last Updated on Wed, Aug 29 2018 3:37 PM

తెలంగాణ టీడీపీలో కలహాలు - Sakshi

తెలంగాణ టీడీపీలో కలహాలు

- లోకేశ్‌తో భేటీలో బయట పడ్డ అభిప్రాయ భేదాలు
రేవంత్‌పై నేతల ఫిర్యాదు
 
 సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ టీడీపీ నేతల మధ్య ఉన్న లుకలుకలు మరోమారు బయట పడ్డాయి. టీడీపీ జాతీయ కార్యదర్శి  నారా లోకేశ్‌తో శనివారం ఎన్టీఆర్ భవన్‌లో జరిగిన ముఖ్యనేతల భేటీలో పలువురు నేతలు వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి వ్యవహార శైలిపై ఫిర్యాదు చేశా రు. పార్టీ వర్గాల ద్వారా అందిన సమాచారం మేరకు.. పార్టీ భవిష్యత్ కార్యాచరణ గురించి చర్చించారు. కొన్నాళ్లుగా నేతల మధ్య కొనసాగుతున్న ఆధిపత్య పోరు ఒక్కసారిగా బయట పడింది. మల్లన్నసాగర్ ప్రాజెక్టు నిర్వాసితులకు మద్దతుగా వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి చేపట్టిన దీక్షపై విమర్శలు వ్యక్తమయ్యాయి.

దీక్షా స్థలిలో ఏర్పాటు చేసిన బ్యానర్లలో పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్, జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ఫొటోలు పెట్టకపోవడాన్ని సీనియర్లు కొత్తకోట దయాకర్‌రెడ్డి, నామా నాగేశ్వర్‌రావు, రావుల చంద్రశేఖర్‌రెడ్డి సహా పలువురు తప్పుపట్టారు. మరోవైపు పార్టీ అధ్యక్షుడు, కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎవరికి వారుగా వేర్వేరు కార్యక్రమాలతో కార్యకర్తలకు అందుబాటులో లేకపోవడం సరికాదని, ఇద్దరిలో ఎవరో ఒకరు అందుబాటులో ఉండాలని లోకేశ్ సూచించారు. అవసరమైతే ప్రతివారం తాను ముఖ్యులతో సమావేశమవుతానని, అవసరాన్నిబట్టి చంద్రబాబు కూడా మాట్లాడతారన్నారు. వివిధ అంశాలపై పార్టీ కమిటీలను ఏర్పాటు చేశారు.

 వ్యవస్థలను నిర్వీర్యం చేస్తోంది...
 అనంతరం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్‌రెడ్డి సమావేశ నిర్ణయాలు తెలిపారు. టీఆర్‌ఎస్ అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేస్తోందన్నారు. టీడీఎల్పీలో గదుల తొలగింపుపై న్యాయ పోరాటం చేస్తామన్నారు. ఆరు కమిటీలు ఏర్పాటు చేశామన్నారు. ఇరిగేషన్ కమిటీకి రేవూరి ప్రకాశ్‌రెడ్డి, హౌసింగ్ - అరవింద్‌కుమార్‌గౌడ్, ట్రైబల్ వెల్ఫేర్-రమేష్ రాథోడ్, మైనారిటీ వెల్ఫేర్- సాజిద్, పెద్దిరెడ్డి, 3 ఎకరాల భూమి - సండ్ర వెంకటవీరయ్య, రుణమాఫీ కమిటీకి అరికెల నర్సారెడ్డిలను ఇన్‌చార్జులుగా నియమించామని రావుల తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement