పొత్తు పోరు
బెడిసికొడుతున్న టీడీపీ-బీజేపీ పొత్తు వ్యూహం
ప్రచారంలో క నిపించని ముఖ్యనేతలు, కార్యకర్తలు
సాక్షి, సిటీబ్యూరో: పేరుకే పొత్తు.. క్షేత్రస్థాయిలో పోరు. గ్రేటర్‌లో టీడీపీ-బీజేపీ కూటమి పరిస్థితి ఇది. సీట్ల సర్దుబాటుతో మొదలైన ఈ చిచ్చు ఇప్పుడు తారాస్థాయికి చేరింది. ‘ఎవరికి వారే యమునా తీరే..’ అన్నట్లు రెండు పార్టీల నేతలు వ్యవహరించడంతో పొత్తు వ్యూహం బెడిసికొట్టేలా ఉంది. ముఖ్య నాయకులు, కార్యకర్తలు కలిసిరాక కొందరు అభ్యర్థులు విజయావకాశాలపై ఆందోళన చెందుతున్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఉమ్మడి పోరని టీడీపీ, బీజేపీ ముఖ్య నేతలు చెబుతున్నా డివిజన్లలో పరిస్థితి మరోలా ఉంది.
పొత్తు ధర్మం మరిచి రెండు పార్టీల అభ్యర్థులు ఒకరిపై ఒకరు కత్తులు దూస్తున్నారు. చాలా చోట్ల టీడీపీ, బీజేపీ రెబెల్స్ గుబులు రేపుతున్నారు. ప్రచారంలో అది స్పష్టంగా కన్పిస్తోంది. బీజేపీ నగర అధ్యక్షుడు బి.వెంకటరెడ్డి భార్య పద్మ తరఫున బాగ్ అంబర్‌పేట డివిజన్‌లో పాదయాత్ర నిర్వహించారు. డివిజన్ టీడీపీ అధ్యక్షుడు తప్ప ఒక్క టీడీపీ కార్యకర్త రాలేదు. ఇక టీడీపీ పోటీచేస్తున్న కవాడీగూడ, అమీర్‌పేట డివిజన్లలో బీజేపీ సహాయ నిరాకరణ చేస్తోంది. కవాడీగూడ టీడీపీ అభ్యర్థి రూపాల రాజశ్రీ ప్రచారంలో ఎమ్మెల్యే లక్ష్మణ్, పదిమంది బీజేపీ కార్యకర్తలు తప్ప ఎవరూ పాల్గొనడం లేదు.
ఒంటరిపోరుతో గెలుపెలా..?
పలు డివిజన్లలో మిత్రపక్ష నేతలు సహకరించడపోవడంతో అభ్యర్థులు ఒంటరి పోరు చేస్తున్నారు. హిమాయత్‌నగర్ నుంచి బీజేపీ అభ్యర్థి బి.మహాలక్ష్మి రామన్‌గౌడ్ బరిలో ఉండగా...టీడీపీ మాజీ కార్పొరేటర్ బాబూయాదవ్ టికెట్ ఆశించారు. టికెట్ దక్కపోవడంతో టీఆర్‌ఎస్‌లోకి జంప్ అయ్యి భార్య హేమలతను పోటీలో నిలిపారు. డివిజన్‌లోని టీడీపీ క్యాడర్ మొత్తం టీఆర్‌ఎస్‌లోకి వలసపోయింది. టీడీపీ నేతలు సహకరించక పోవడంతో బీజేపీ అభ్యర్థి మహాలక్ష్మి రామన్‌గౌడ్ ఒంటరి పోరుకు సిద్ధమయ్యారు. మాదాపూర్ డివిజన్ బీజేపీ అభ్యర్థి సతీష్ సకాలంలో బి-ఫారం ఇవ్వలేకపోయారు. దీంతో కూటమి నుంచి టీడీపీ అభ్యర్థి ఖరారయ్యాడు. అయితే ప్రచారంలో బీజేపీ నేతలెవ్వరూ పాల్గొనడం లేదు. సతీష్‌ను ఇండిపెండెంట్‌గా గెలిపించాలని కార్యకర్తలు, నాయకులు టీడీపీకి సహాయ నిరాకరణ చేస్తున్నారు.
పైకి మిత్రులు.. తెరచాటున ఎత్తులు
బేగంబజార్, ఘాన్సీబజార్, గోషామహల్ డివిజన్లలో టీడీపీ క్యాడర్ అంటీముట్టనట్లు ఉంది. ఇక బీజేపీలోనే ఓ వ్యతిరేకవర్గం గట్టిగా పనిచేస్తోంది. ఈ స్థానాల్లో గెలుస్తామా లేదా అన్న భయం బీజేపీకి పట్టుకుంది. ఉప్పల్, చర్లపల్లి, ఐ.ఎస్.సదన్, ఉప్పుగూడ, రామాంతపూర్, ఓల్డ్ మలక్‌పేట్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, బోరబండ, గచ్చిబౌలి, పటాన్‌చెరు, తార్నక, బౌద్ధనగర్ డివిజన్లలో మిత్రపక్షాలు పరోక్షంగా తలపడుతున్నాయి. ఈ మిత్రభేదం చివరికి ఏం చేటు చేస్తుందోనని టీడీపీ, బీజేపీ ముఖ్యనేతలు తలలు పట్టుకుంటున్నారు.