
‘నామినేటెడ్’కు ఎదురు చూపులే!
సాక్షి, హైదరాబాద్: అధికార టీఆర్‌ఎస్ నేతలకు చివరకు ఎదురు చూపులే మిగిలేలా ఉన్నాయి. రేపు, మాపు అంటూ వాయిదా వేసుకుంటూ వస్తున్న నామినేటెడ్ పదవుల భర్తీ ఇప్పట్లో కొలిక్కి వచ్చేలా లేదన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు రెండేళ్లు కావొస్తున్నా, పార్టీ శ్రేణులకు కలిసొచ్చిన పదవులు దాదాపు ఏమీ లేవు.
రాష్ట్ర ప్రణాళికా మండలి ఉపాధ్యక్ష పదవి, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ వంటి ఒకటీ అరా పదవులనే భర్తీ చేశారు. గత ఏడాది జరిగిన పార్టీ 14వ ఆవిర్భావ సభ సందర్భంగా పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు త్వరలోనే పదవులు భర్తీ అవుతాయని, అందరికీ అవకాశాలు వస్తాయని, తమ వంతు వచ్చేవరకు ఎదురు చూడాలని హితబోధ చేశారు. అయితే, పార్టీ వర్గాల ద్వారా అందిన సమాచారం మేరకు నామినేటెడ్ పదవుల భర్తీ ఇప్పట్లో లేదని తెలుస్తోంది.
వ్యవసాయ మార్కెట్ కమిటీలకు పాలక మండళ్లను నియమించేందుకు రిజర్వేషన్లు కూడా ఖరారు చేశారు. ఇంతవరకూ జాబితాలు స్వీకరించే దశలోనే ఉంది. కాగా, ఎండోమెంట్ కమిటీలు, గ్రంథాలయ కమిటీల వంటి పదవుల భర్తీతో జిల్లా స్థాయిలో చాలా మందికి రాజకీయ నిరుద్యోగం తీరుతుంది. రాష్ట్ర స్థాయి కార్పొరేషన్లు, జిల్లా స్థాయి కార్పొరేషన్లు, ఇతరత్రా పదవులను భర్తీ చేస్తే ప్రభుత్వంపై ఏకంగా ఏటా రూ. 150 కోట్ల ఆర్థిక భారం పడుతుందని లెక్క తేల్చారని సమాచారం.
పదవులు భర్తీ చేయక పోవడానికి ఆర్థిక భారంతో పాటు ఇతరత్రా వచ్చే ఇబ్బందులపైనా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. పదవుల పేరు చెప్పి అధికారులపై ఒత్తిళ్లు తేవడం, అవినీతి ఆరోపణలకు కారణం కావడం, నియోజకవర్గాల్లో ప్రొటోకాల్ సమస్యలు తలెత్తడం వంటి అంశాలపైనా చర్చించారని అంటున్నారు. మొత్తంగా పార్టీకి చెడ్డపేరు వచ్చే అవకాశమే ఎక్కువగా ఉన్నప్పుడు పదవుల భర్తీ ఆలస్యం అయితే మాత్రమేంటన్న ఆలోచనతోనే మీనమేషాలు లెక్కిస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
పార్టీ పదవులదీ అదే పరిస్థితి
గత ఏడాది పార్టీ ప్లీనరీలో రాష్ట్ర అధ్యక్షునిగా కేసీఆర్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఇక, అంతే... పార్టీకి సంబంధించి రాష్ట్ర స్థాయిలో ఒక్క పదవీ భర్తీ కాలేదు. జిల్లా స్థాయిల్లోనూ జిల్లా అధ్యక్షులు మినహా కమిటీల నియామకాన్ని చేపట్ట లేదు. మొదటి నుంచి పార్టీతో ఉన్నవారే కాకుండా, టీడీపీ, కాంగ్రెస్ తదితర పార్టీల నుంచి వచ్చిన వారూ ఉన్నారు. వీరు గతంలో అధికార పార్టీల్లో ఉండి పదవులు అనుభవించినవారే. కేవలం పదవులు, విజి టింగ్ కార్డులు చూపి పైరవీలు చేసిన ఉదంతాలూ ఉన్నాయి. ఇప్పటికిప్పుడు వీరికి నామినేటెడ్ పదవులు కానీ, పార్టీ పదవులు కానీ ఇస్తే అధికారులపై ఒత్తిడి, పనుల కోసం వెళ్ల డం వంటివి జరుగుతాయని, ప్రభుత్వానికి, పార్టీకి చెడ్డపేరు వస్తుందన్న అంచనాతోనే పదవుల పంపకం జరగలేదని చెబుతున్నారు.