
పాతనోట్ల మార్పిడికి సినీ దర్శకుడి యత్నం
∙రూ.1.20 కోట్ల పాత కరెన్సీ పట్టివేత
∙పరారీలో సూత్రధారి రామకృష్ణ
బంజారాహిల్స్: పాత కరెన్సీ మార్పిడి చేస్తున్న ముఠాను బంజారాహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.1.20 కోట్ల పాత కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. ఈ నోట్ల మార్పిడి తతంగంలో ఓ సినీదర్శకుడు సూత్రధారిగా ఉన్నట్లు తెలిపారు. వివరాల్లోకి వెళ్తే... బంజారాహిల్స్ రోడ్ నెం. 2లోని కమలాపురి కాలనీలో సినీ దర్శకుడు కిట్టు అలియాస్ రామకృష్ణ (కేటుగాడు సినిమా దర్శకుడు) కార్యాలయం ఉంది. ఈ నెల 31తో పాత కరెన్సీ మార్చుకునేందుకు గడువు ముగియనుండటంతో అతను తెలిసిన వారిని సంప్రదించి కరెన్సీ మార్పిడి చేస్తానని పిలిపించాడు. దీంతో ఆదివారం వివిధ ప్రాంతాలకు చెందిన వ్యాపారులు పెద్దమొత్తంలో పాత కరెన్సీ నోట్లు తీసుకుని కిట్టు సినీ కార్యాలయానికి వచ్చారు.
దాదాపు 30 మంది రూ.13 కోట్లు తీసుకువచ్చినట్లు సమాచారం. ఇందులో పాత బస్తీకి చెందిన వ్యాపారి వసీం రూ. 20 లక్షలు, అమీర్‌పేట్‌కు చెందిన ప్రసాద్ రూ. 18 లక్షలు, మరో వ్యాపారి దిలీప్ రూ. 20 లక్షలు తేగా, మిగతా వారు కూడా పెద్దమొత్తంలో నగదు తీసుకువచ్చి కిట్టు కోసం వేచి చూస్తున్నారు. అయితే అదే సమయంలో ముంబయికి చెందిన బిలాల్ షుక్రు అనే వ్య రివాల్వర్‌తో అక్కడికి రావడంతో వారులో కొందరు అక్కడినుంచి జారుకున్నారు. ఇలోగా దీనిపై సమాచారం అందడంతో పోలీసులు దాడులు నిర్వహించి ప్రసాద్, దిలీప్, వసీంతోపాటు మరో 9 మందిని అదుపులోకి తీసుకుని పెద్ద మొత్తంలో పాత కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు.
వీరిని స్టేషన్‌కు తరలించి షుక్రూ నుంచి రివాల్వర్ స్వాధీనం చేసుకున్నారు. కాగా వారిని భయపెట్టి పాత కరెన్సీతో ఉడాయించాలన్నది కిట్టూ గ్యాంగ్ పథకం పన్నినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో దర్శకుడు కిట్టు పాత్రపై పోలీసులు ఆరా తీస్తున్నారు. గత వారం రోజులుగా పెద్ద సంఖ్యలో వ్యాపారులు వస్తున్నట్లు తెలిసింది. పరారీలో ఉన్న ప్రధాన సూత్రదారి కిట్టు కోసం గాలింపు చేపట్టారు. అతనితోపాటు రాజేష్, మనోజ్, బిలాల్, పాషా, వసీం, దిలీప్‌జైన్, ప్రసాద్, తులసీదాస్‌లపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ఆపరేషన్ రూ.100 కోట్లు
పాత నోట్ల మార్పిడి పేరుతో గత కొద్ది నెలలుగా కొన్ని ముఠాలు జోరుగా కమీషన్ దందా నడిపిస్తున్నాయి.. ఈ వ్యవహారంలో సినీపరిశ్రమలోని కొందరు పెద్దల పాత్ర ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.. ఒక ప్రముఖ నిర్మాత కుమారుడు గడువు ముగిసేలోగా రూ.100 కోట్లు మార్చాలని ప్రణాళిక రూపొందించినట్లు సమాచారం.. బంజారాహిల్స్ కేంద్రంగా గత మూడు నెలలుగా 60–40 పేరుతో జోరుగా దందా నడుపుతున్నారు. పాతనోట్ల రద్దుతో చాలా మంది తమ వద్ద ఆదాయానికి మించి ఉన్న కరెన్సీని మార్చుకొనేందుకు అడ్డదారులు తొక్కారు. ఈ నేపథ్యంలోనే చాలా మంది 40 శాతం కటింగ్‌తో కొత్త నోట్లను తీసుకున్నారు. ఈ వ్యవహారం నోట్ల జమ నిర్ణీత గడువు వరకు కొనసాగింది. ఒకానొకదశలో 10 శాతం కమీషన్‌పై కూడా నోట్లను మార్పిడి చేశారు.
నేడు 60–40
బ్యాంకులు పాతనోట్లను స్వీకరించే గడువు ముగియడంతో పలువురు మిగిలిపోయిన డబ్బును ఇప్పుడు తమకు తెలిసిన వారి ద్వారా మార్చుకొనే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే కొందరు 60–40, 80–20 శాతానికి మార్చుకుంటున్నారు. ఇందుకు బంజారాహిల్స్ ప్రాంతం ముఖ్య కేంద్రంగా మారింది.
‘పెద్దల’ ఇలాకాలో..
నోట్ల మార్పిడి వ్యవహారం ఇప్పుడు క్లిష్టంగా మారడంతో పెద్దలు రంగంలోకి దిగారు. తమ పరిచయాల ద్వారా డబ్బును మార్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే కొందరు తమకు ఆర్బీఐలో పెద్ద పరిచయాలు ఉన్నాయంటూ కమీషన్‌పై మార్పిడి చేస్తున్నారు. దీనికితోడు సినీపరిశ్రమకు చెందిన కొందరు జోరుగా దందా కొనసాగిస్తున్నారు.. బంజారాహిల్స్ కేసులో సినీ దర్శకుడు కిట్టు ప్రమేయం ఉన్నట్లు తేలడంతో, ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న మరికొందరు ఆందోళన చెందుతున్నారు.