రెక్కీ లేకుండా ఎటాక్!
⇒ఐదు నెలల క్రితం నేరాలు మొదలు
⇒ఇప్పటికి చోరీకి యత్నించింది 40 చోట్ల
⇒ ‘వాకింగ్ డ్రస్’లో వస్తూ చేతివాటం
సిటీబ్యూరో: ఓ దొంగ ఏదైనా ఇంటిని టార్గెట్‌గా చేసుకున్నప్పుడు ముందుగా రెక్కీ చేస్తాడు. ఆ ఇంటి పరిసరాలను పూర్తిగా గమనించిన తర్వాతే చోరీకి యత్నిస్తాడు. అయితే ఈస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు శనివారం అరెస్టు చేసిన ఘరానా చోరుడు గఫార్ ఖాన్ అలియాస్ జిగర్ పంథానే వేరు. ఎలాంటి రెక్కీలూ లేకుండా నేరుగా ఎటాక్ చేయడం ఇతడి నైజం. యాకత్‌పురకు చెందిన జిగర్ ఎంజే మార్కెట్‌లో తండ్రితో కలిసి పూల వ్యాపారం చేసేవాడు. జల్సాలకు అలవాటు పడిన ఇతగాడు తేలిగ్గా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో గత ఏడాది నవంబర్‌లో చోరీల బాటపట్టాడు.
మలక్‌పేటతో ప్రారంభించి ఐదు నెలల కాలంలో ఏకంగా 19 ఇళ్లలో చోరీలు చేశాడు. అర్ధరాత్రి వేళ బయలుదేరే ఇతగాడు దారిలో ఎవరికీ అనుమానం రాకుండా పక్కా జాగ్రత్తలు తీసుకునేవాడు. వాకింగ్‌కో, జాగింగ్‌కో వెళ్తున్నట్లు ట్రాక్స్, టీ–షర్ట్, నెత్తిన టోపీతో వస్తాడు. సంపన్నులు నివసించే ప్రాంతాలను ఎంచుకుని ఓ చోట తన హోండా యాక్టివాను పార్క్ చేసి ఆగుతాడు. ఆ చుట్టపక్కల ఉన్న వాటిలో అనువైన ఇళ్లలోకి ప్రవేశించి చోరీకి యత్నిస్తాడు. ఇలా గడిచిన ఐదు నెలల కాలంలో దాదాపు 40 ఇళల్లలోకి ప్రవేశించాడు. ఒకటి, రెండతస్తుల ఇళ్లలోకి వంటగది తలుపులు, కిటికీల నుంచి ప్రవేశించి జిగర్ యజమానులు ఉన్నప్పుడే చోరీలు చేస్తుంటాడు. 40 ఇళ్లలో ప్రయత్నించిన ఇతడు 19 చోట్ల ‘సఫలీకృతుడై’ కేజీన్నర బంగారం, నగదు చోరీలు చేయగలగాడు.
ఇలా వచ్చిన సొత్తును ఘాన్సీ బజార్‌కు చెందిన ముగ్గురు రిసీవర్లకు అమ్మేవాడు. ఆ సొమ్మును అన్ని రకాలైన జల్సాలు చేస్తూ ఖర్చు చేసేవాడు. మలక్‌పేట, సరూర్‌నగర్, సంతోష్‌నగర్ ఇలా మొత్తం ఎనిమిది ఠాణాల పరిధిలో 19 నేరాలు చేశాడు. నేరం చేసే సందర్భంలో ఖర్చీఫ్‌ను నోట్లో పెట్టుకోవడమో, ముక్కుకు కట్టుకోవడమో చేస్తుంటాడు. అనేక ప్రాంతాల్లోని సీసీ కెమెరాల్లో ఇతడి కదలికలు రికార్డు అయ్యాయి. వీటి ఆధారంగా ఒకే నేరగాడి పనిగా నిర్ధారించారు పోలీసులు. ఈ ఆధారాలతో రంగంలోకి దిగిన తూర్పు మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు సాంకేతికంగా దర్యాప్తు చేసి శనివారం జిగర్‌తో పాటు రిసీవర్లను పట్టుకోగలిగారు. వరుసగా చోరీలు చేసిన ఇతడిపై పీడీ యాక్ట్ ప్రయోగించడానికి నగర పోలీసులు సన్నాహాలు చేస్తున్నారు.