ఆహా.. ఏమి రుచి..!
సుందరయ్య విజ్ఞాన కేంద్రం (హైదరాబాద్): మన ఆహారం, మన అలవాటు పేరిట తెలంగాణ జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ఆదివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన పుడ్ ఫెస్టివల్ ఎంతగానో ఆకట్టుకుంది. ఎలాంటి రసాయనాలు కలువని ఆహార పదార్ధాలు తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు, చిరు ధాన్యాల గురించి తెలియజెప్పేందుకు దీన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జొన్నలు, సజ్జలు, రాగులు, కొర్ర బియ్యం, జొన్న పిండి, సజ్జపిండి, పెసలు, కందిపప్పు, పల్లీలు, వివిద రకాల రొట్టెలు, తేనే, వాటితో తయారు చేసిన పిండి వంటలు సందర్శకులను విశేషంగా అకట్టుకున్నాయి.
అనంతరం ప్రదర్శనలో భాగంగా.. రూ. 50కు కొర్ర బియ్యంతో చేసిన ఉప్మా, పరమాన్నం, జొన్న రొట్టెలను ప్రదర్శనకు వచ్చిన వారికి వడ్డించారు. ఎంతో రుచికరంగా ఉన్నాయంటూ వారు వాటిని ఇష్టంగా తిన్నారు. ఈ కార్యక్రమంలో జన విజ్ఞాన వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.రమేష్, రాష్ట్ర నాయకులు బిఎన్.రెడ్డి. విశ్వేశ్వర్ రావు తదితరులు పాల్గొన్నారు.