sundaraiah vignan kendram
-
జోకర్ నాయకుడైతే చూసేది సర్కస్ మాత్రమే.. ప్రకాష్ రాజ్ సెటైర్లు
సాక్షి, హైదరాబాద్: నగరంలోని బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సమూహ సెక్యులర్ రైటర్స్ ఫోరం ఆవిర్భావ సభ శనివారం జరిగింది. ఈ సభను సినీనటుడు, రచయిత,సామాజిక కార్యకర్త ప్రకాష్ రాజ్ ప్రారంభించారు. ఈ సందర్బంగా సమూహ లోగోను ఆవిష్కరించారు. ‘లౌకిక ప్రజాస్వామిక విలువలకోసం రచయితలు అందరూ సంఘటితమైనదే సమూహా. ఫాసిస్ట్ పాలనకు వ్యతిరేకంగా రచయితలు అందరి ఉమ్మడి స్వరమే సమూహ. సహనశిలతను పాటిస్తూ మతోన్మాదాన్ని ధిక్కరించే సాహిత్యకారులు, సాంస్కృతిక కార్యకర్తల ఉమ్మడి వేదిక సమూహా’. ఈ కార్యక్రమంలో పలువురు కవులు, రచయితలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ.. ‘కేవలం ప్రతిభ ఉంటేనే రచయిత, కవి, కళాకారుడు కాలేరు. సమాజ పరిస్థితులపై స్పందించగలిగితేనే రాణించగలుగుతారు. శరీరానికి తగిలిన గాయాలు మౌనంగా ఉంటే తగ్గుతాయి.. కానీ దేశానికి తగిలిన గాయాలు మౌనంగా ఉంటే తగ్గలేవు. ప్రస్తుతం అలాంటి పరిస్థితుల్లో ఉన్నాం. సమాజంలో జరుగుతున్న పరిణామాలు చూస్తూ ఊరికే కూర్చోలేను. 100 రోజుల నుండి మణిపూర్ రగిలిపోతుంటే పార్లమెంట్లో నువ్వా నేనా అన్నటు నడిచారు. రాజకీయం తప్ప సమస్య మీద స్పందన లేదు. 10 రోజుల పార్లమెంట్ సమావేశాల్లో రాజకీయం తప్ప ప్రజల సమస్యలపై చర్చించలేదు. జోకర్ని నాయకుడు చేస్తే మనం చూసేది సర్కస్ మాత్రమే. మనలో ఐక్యత లేదు. మొదట మనలో మార్పు రావాలి. 70ఏళ్ల తర్వాత మనం రియలైజ్ అయ్యాం.. ఎక్కడ తప్పు జరిగిందని చూసుకోవాలి. మొదటిసారి ఇలాంటి స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకోవడం బాధగా ఉంది’ అంటూ కామెంట్స్ చేశారు. ఇది కూడా చదవండి: గులాబీలో సీటు హీటు.. కేటీఆర్, కవిత మధ్య పొలిటికల్ పోరు! -
12 నుంచి జన విజ్ఞాన వేదిక రాష్ట్ర మహాసభలు
హైదరాబాద్: ఈ నెల 12 నుంచి 14 వరకు బాగ్లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జన విజ్ఞాన వేదిక 3వ రాష్ట్ర మహాసభలు నిర్వహించనున్నట్లు సంస్థ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ప్రొఫెసర్ ఆదినారాయణ, శ్రీనాథ్ తెలిపారు. ఈ కార్యక్రమం లో సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్ కె.రామచంద్రమూర్తి ప్రారంభోపన్యాసం చేయనున్నారు. మాజీ ఎమ్మెల్సీ చుక్కా రామయ్య, సీసీఎంబీ మాజీ డైరెక్టర్ మోహన్రావు, ప్రముఖ పాత్రికేయుడు పాలగుమ్మి సాయినాథ్ తదితరులు ఇందులో పాల్గొంటారని తెలిపారు. -
ఆహా.. ఏమి రుచి..!
సుందరయ్య విజ్ఞాన కేంద్రం (హైదరాబాద్): మన ఆహారం, మన అలవాటు పేరిట తెలంగాణ జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ఆదివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన పుడ్ ఫెస్టివల్ ఎంతగానో ఆకట్టుకుంది. ఎలాంటి రసాయనాలు కలువని ఆహార పదార్ధాలు తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు, చిరు ధాన్యాల గురించి తెలియజెప్పేందుకు దీన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జొన్నలు, సజ్జలు, రాగులు, కొర్ర బియ్యం, జొన్న పిండి, సజ్జపిండి, పెసలు, కందిపప్పు, పల్లీలు, వివిద రకాల రొట్టెలు, తేనే, వాటితో తయారు చేసిన పిండి వంటలు సందర్శకులను విశేషంగా అకట్టుకున్నాయి. అనంతరం ప్రదర్శనలో భాగంగా.. రూ. 50కు కొర్ర బియ్యంతో చేసిన ఉప్మా, పరమాన్నం, జొన్న రొట్టెలను ప్రదర్శనకు వచ్చిన వారికి వడ్డించారు. ఎంతో రుచికరంగా ఉన్నాయంటూ వారు వాటిని ఇష్టంగా తిన్నారు. ఈ కార్యక్రమంలో జన విజ్ఞాన వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.రమేష్, రాష్ట్ర నాయకులు బిఎన్.రెడ్డి. విశ్వేశ్వర్ రావు తదితరులు పాల్గొన్నారు.