
ప్రజాహితం కోసం మొక్కలు నాటాలి
పిలుపునిచ్చిన శాసనసభ స్పీకర్
సాక్షి, హైదరాబాద్ : ప్రజా హితం కోసం ప్రజలందరూ మొక్కలు నాటాలని శాసనసభ స్పీకర్ ఎస్. మధుసూదనాచారి పిలుపునిచ్చారు. ‘ మొక్కలు నాటాలి.. అడవులను ప్రేమించాలి. సాంకేతికత పెరిగే కొద్దీ ప్రజాహితాన్ని మరిచిపోతున్నారు..’ అని ఆయన అన్నారు. శాసనసభ, శాసనమండలి ఆవరణలో మంగళవారం ఆయన మండలి చైర్మన్ స్వామిగౌడ్‌తో కలిసి హరితహారం కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి కొనసాగించడానికే సీఎం కేసీఆర్ హరితహారం చేపట్టారని, ప్రజల సంక్షేమం కోసం చేపట్టిన ఈ కార్యక్రమంలో ప్రజలంతా భాగస్వాములు కావాలని ఆయన కోరారు.
వెయ్యేళ్ల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని సీఎం హరిత హారం ప్రారంభించారని, ఇలాంటి గొప్ప కార్యక్రమాన్ని చేపట్టడం ప్రపంచంలో తొలిసారని కొనియాడారు. కార్యక్రమంలో ప్రజలంతా భాగ స్వాములు కావాలని కోరారు. హరితహారంలో డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, ఎమ్మెల్సీలు బోడకుంటి వెంకటేశ్వర్లు, పొంగులేటి సుధాకర్‌రెడ్డి తదిరులు పాల్గొని మొక్కలు నాటారు.