సమాధులపై కట్టుకోలేకపోయారా?
సాక్షి, హైదరాబాద్: ‘‘రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌కు రాజధాని కావాల్సిన మాట నిజమే అయినా రైతుల కడుపుకొట్టి, బలవంతంగా బయటకు పంపి నిర్మిస్తారా? ఇంతకన్నా రైతులు, బడుగు బలహీన వర్గాల ప్రజల సమాధులమీద నిర్మించుకోలేకపోయారా?’’ అని అఖిల భారత రైతు సంఘం ప్రధాన కార్యదర్శి, మాజీ ఎంపీ అతుల్‌కుమార్ అంజన్ మండిపడ్డారు. అధికారంలోకి రావడానికి భూమ్యాకాశాల్ని ఏకం చేసిన వ్యక్తికి ఇదో పెద్ద లెక్కా అని వ్యాఖ్యానించారు. చంద్రబాబు తెలివితేటలేమిటో తమకు బాగా తెలుసంటూ.. సీఎం పీఠాన్ని ఎక్కడానికి పిల్లనిచ్చిన మామకే వెన్నుపోటు పొడిచిన వ్యక్తన్నారు.
గురువారమిక్కడ ప్రారంభమైన రైతుసంఘం 29వ జాతీయ మహాసభల్లో పాల్గొనేందుకు వచ్చిన అతుల్, ఏపీకి చెందిన మరికొందరు రైతు నేతలు ‘సాక్షి’లో వస్తున్న ‘రాజధాని దురాక్రమణ’ కథనాలపై గురువారం స్పందిం చారు.ఎస్సీ, ఎస్టీలు, చిన్న,మధ్యతరహా రైతుల్ని తరిమివేసి రియల్ ఎస్టేట్ వ్యాపారానికి తెరలేపారన్నారు.
మంత్రులా? రియల్టర్లా?
రాజధాని అమరావతిపై గద్దల్లా వాలిన పెద్దలు మంత్రులు కాదు.. రియల్టర్లు. మంత్రులుగా చెలామణి అవుతున్న నారాయణ, ప్రత్తిపాటి పుల్లారావు, రావెల కిషోర్‌బాబు బరితెగించారనే దానికి నిదర్శనమే సాక్షి దినపత్రికలో వస్తున్న కథనాలు. రాజధాని ఎక్కడ వస్తుందో తెలియబట్టే వీళ్లు వందలాది ఎకరాల్ని పేదలనుంచి కొనేసి వాళ్లనోట మట్టికొట్టారు. -రామచంద్రయ్య, ఏపీ రైతు సంఘం అధ్యక్షుడు
చినబాబు పాత్ర ఉంది
ప్రస్తుత భూ కబ్జాలో పెద్దబాబు, చినబాబుల పాత్ర ఉంది. పేదల నోళ్లు కొట్టేలా జోన్లు ఏర్పాటు చేశారు. సీఎం, ఆయన అనుచరులు కొనుగోలు చేసిన భూముల్ని అగ్రికల్చర్ జోన్ నుంచి మినహాయించి ఇప్పుడు రియల్‌ఎస్టేట్ వ్యాపారానికి తెరలేపారు. ఈ మొత్తం వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు జరపాలి.
- రావుల వెంకయ్య, కేవీవీ ప్రసాద్, రైతుసంఘం జాతీయ నేతలు
విచారణకు సిద్ధంకండి
‘రాజధాని దురాక్రమణ’ వార్తలు రాసిన మీడియాపై చిందులేసే బదులు బహిరంగ విచారణకు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు సిద్ధపడాలి. నీతిమంతులైతే భయపడడమెందుకు? -గుడితి అప్పలనాయుడు
శ్రీకాకుళం జిల్లా కార్యదర్శి
ఎక్కడొస్తుందో సీఎం ముందే చెప్పారు.. సీఎం ముందే తన అనుచరులకు రాజధాని ఎక్కడొస్తుందో చెప్పారు. రైతుల్ని త్యాగాలు చేయమన్నారు. మంత్రుల్ని కుబేరుల్ని చేశారు.
- జి.చంద్ర, వైఎస్సార్ జిల్లా కార్యదర్శి