
1450 మురికివాడల్లో 'డబుల్' ధమాకా
దశలవారీగా 1.08 లక్షల ఇళ్లు
* స్లమ్ ఫ్రీ సిటీనే లక్ష్యం: మంత్రులు
* గ్రేటర్‌లోని వివిధ ప్రాంతాల్లో 'డబుల్ బెడ్‌రూం' శంకుస్థాపనలు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌ను స్లమ్ ఫ్రీ సిటీగా మార్చేందుకు నగరంలోని 1450 మురికివాడల్లో దశలవారీగా డబుల్ బెడ్‌రూం ఇళ్లు నిర్మించి ఇస్తామని రాష్ట్ర మంత్రులు చెప్పారు. విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికాబద్ధంగా పనిచేస్తున్నామని, అందు లో భాగంగా మురికివాడల్లో డబుల్ బెడ్‌రూం ఇళ్లు నిర్మిస్తున్నామన్నారు. నగరంలోని ఐదు నియోజకవర్గాల పరిధిలోని ఏడు ప్రాంతాల్లో గురువారం డబుల్ బెడ్‌రూం ఇళ్లకు మంత్రులు శంకుస్థాపనలు చేశారు. ఉప ముఖ్యమంత్రి మహమూద్‌అలీ, మం త్రులు నాయిని నరసింహారెడ్డి, టి.పద్మారావు, ఇంద్రకరణ్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్, కె.టి.రామారావు, ఆయా నియోజకవర్గాల శాసనసభ్యులు పాల్గొన్నారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా...
'హైదరాబాద్‌ని గుడిసెలు, మురికివాడలు లేని నగరంగా తీర్చిదిద్దేందుకు 1,08,000 ఇళ్లను దశలవారీగా నిర్మిస్తున్నాం. వీటితో పాటు ఎక్కడ ప్రభుత్వ స్థలాలు అందుబాటులో ఉన్నా ఈ ఇళ్లు ఏర్పాటు చేస్తాం. ఈ ఏడాది 10 వేలు, ఆ మరుసటి సంవత్సరాలు వరుసగా 25 వేలు, 50 వేల డబుల్ బెడ్‌రూం ఇళ్లు నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశాం. దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా ఏడాది కాలంలో నగరంలోని ఐడీహెచ్ కాలనీలో ఇళ్ల నిర్మాణం పూర్తిచేసి దాదాపు 400 కుటుంబాలకు అందజేశాం. ఈ మోడల్ కాలనీని దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ఎంతో మంది వచ్చి ఆసక్తిగా సందర్శిస్తున్నారు’ అని కేటీఆర్ అన్నారు. మహమూద్‌అలీ మాట్లాడుతూ... 'టీఆర్‌ఎస్ ప్రభుత్వం నగరంలోని 1.08 లక్షల మందికి ఉచితంగా ఇళ్ల పట్టాలు అందజేసి రికార్డు సృష్టించింది. సామాజిక భద్ర త పింఛన్లతో వృద్ధులు, వికలాంగులు, వితంతువుల జీవితాల్లో కొత్త వెలుగులు నింపింది' అన్నారు. నాయిని మాట్లాడుతూ... ‘నగరంలోని ఆటోలకు రూ.77 కోట్ల రవాణా పన్ను మాఫీ, డ్రైవర్లకు రూ.5 లక్షల ప్రమాద బీమా పథకాల ద్వారా ప్రభుత్వం కార్మిక పక్షపాతిగా నిలిచింది’ అని చెప్పారు. 'డబుల్ బెడ్‌రూం ఇళ్లకు ఎవరూ ఒక్కరూపాయి కూడా చెల్లించాల్సిన పనిలేదు. మొత్తం నిర్మాణ వ్యయాన్ని ప్రభుత్వమే భరిస్తుంది' అన్నారు.
శంకుస్థాపనలు జరిగిందిక్కడే...
రసూల్‌పురా క్రాస్‌రోడ్, కట్టమైసమ్మ సిల్వర్ కాంపౌండ్ (కంటోన్మెంట్ నియోజకవర్గం), లంబాడీతండ, శ్రీసాయిచరణ్‌కాలనీ; బాగ్‌లింగంపల్లి చౌరస్తా (ముషీరాబాద్), కాంగారి నగర్ (అంబర్‌పేట), పిల్లిగుడిసెలు (మలక్‌పేట), సర ళాదేవినగర్ (యాకుత్‌పురా)