‘నానక్‌రామ్‌గూడ’ ఘటనలో నలుగురి అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజధానిలో ఏడంతస్తుల భవనం కుప్పకూలిన ఘటనకు సంబంధించిన కేసులో నలుగురిని సైబరాబాద్ పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. వీరిలో భవన యజమాని తుల్జారామ్ సత్యనారాయణ సింగ్ అలియాస్ సత్తూ సింగ్, అతని కుమారుడు అనిల్ కుమార్‌సింగ్, మేస్త్రి బిజ్జా వేణుగోపాల్, సివిల్ ఇంజనీర్ అల్లం శివరామకృష్ణ ఉన్నారు. వీరిపై ఐపీసీ 304(టూ), 304(ఏ), 338, 427 ఆర్/డబ్ల్యూ సెక్షన్ల కింద గచ్చిబౌలి ఠాణాలో కేసులు నమోదు చేశారు. ఇతరుల ప్రాణాలకు ముప్పు ఉందని తెలిసి సులువుగా డబ్బు వస్తుందనే ఆశతో భవనాన్ని నిర్మించారని పోలీసులు చెబుతున్నారు. గురువారం కూలిన భవనానికి పక్కనే ఉన్న ఇంటి యజమాని తుల్జారామ్ బీరేందర్ ఫిర్యాదుతో గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేశారు. (ఆశలు సమాధి!)
నిబంధనలు అతిక్రమించారు: ‘భవన యజమాని సత్తూ సింగ్ 267 చదరపు గజాల్లో ఏడంతస్తుల భవనాన్ని నిర్మించారు. సరైన ప్లాన్ లేకుండా, ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకుండా నిబంధనలు అతిక్రమించి శివరామకృష్ణ ప్లాన్ ఇవ్వడం, దాన్ని మేస్త్రి వేణుగోపాల్ అమలు చేశారని విచారణలో తేలింది’ అని అడిషనల్ డీసీపీ(క్రైమ్స్) శ్రీనివాస్‌రెడ్డి ఆదివారం విలేకరులకు తెలిపారు. ఈ నిర్మాణం విషయంలో కొంత మంది జీహెచ్‌ఎంసీ అధికారులకు లంచం ఇచ్చినట్టుగా కూడా గుర్తించామన్నారు. భవన శిథిలాలను పూర్తి స్థాయిలో తొలగిస్తే ఆ ప్రమాద తీవ్రత తెలుస్తుందన్నారు. నిందితులు గతంలో నిర్మించిన భవన నిర్మాణాల డిజైన్లను నిఫుణులకు అందించామని, వారి నివేదికను బట్టి చర్యలు తీసుకుంటామని తెలిపారు.