మితి మీరిన వేగం.. తీసింది ప్రాణం | Four people dead in road accident with Negligent driving | Sakshi
Sakshi News home page

మితి మీరిన వేగం.. తీసింది ప్రాణం

Published Sat, May 13 2017 2:42 AM | Last Updated on Sat, Oct 20 2018 5:55 PM

మితి మీరిన వేగం.. తీసింది ప్రాణం - Sakshi

మితి మీరిన వేగం.. తీసింది ప్రాణం

తుక్కుగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం
- డీసీఎంను ఢీకొట్టి పల్టీలు కొట్టిన కారు
- ముగ్గురు స్నేహితులు మృతి.. ఒకరికి గాయాలు


హైదరాబాద్‌: ఔటర్‌ రింగ్‌ రోడ్డు మరోసారి నెత్తురోడింది. మితిమీరిన వేగంతో దూసుకొచ్చిన ఓ కారు డీసీఎంను ఢీకొట్టి పది మీటర్ల దూరం పల్టీలు కొట్టింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు స్నేహితులు మృత్యువాత పడగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. పహాడీషరీఫ్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో శుక్రవారం ఉదయం ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. వైజాగ్‌కు చెందిన రవితేజ(27), విజయవాడకు చెందిన సూర్యతేజ(27), నల్లగొండకు చెందిన రోహిత్‌(26), కరీంనగర్‌కు చెందిన కె.కిరణ్‌ కుమార్‌(27) ఖరగ్‌పూర్‌ ఐఐటీలో క్లాస్‌మేట్స్‌.

ప్రస్తుతం రవితేజ వొరాకిల్‌లో, రోహిత్‌ అమెజాన్‌లో, సూర్యతేజ జిమోసీలో ఉద్యోగాలు చేస్తుండగా.. కిరణ్‌ ఉద్యోగా న్వేషణలో ఉన్నాడు. వీరు కొండాపూర్‌లో వేర్వేరుగా నివాసం ఉం టున్నారు. ఖమ్మం జిల్లాలో స్నేహితుడి వివాహం ఉండటంతో శుక్రవారం ఉదయం 6.30 గంటలకు నలుగురు స్నేహితులు సూర్యతేజకు చెందిన వెర్నా కారు(ఏపీ16బీబీ3888)లో బయల్దే రారు. కాగా, మహేశ్వరం నుంచి డీసీఎం వ్యాన్‌(ఏపీ29టీసీ0458)లో డ్రైవర్‌ దయానంద్‌ ఉదయం 7.30 గంటలకు తుక్కుగూడ ఎంట్రీ రూట్‌ నుంచి ఓ ఆర్‌ఆర్‌ౖò పైకి వచ్చాడు. ఈ సమయంలో వెనుక నుంచి వేగంగా వచ్చిన కారు డీసీఎంను కొనభాగంలో ఢీ కొట్టింది. దీంతో పూర్తిగా అదుపుతప్పిన కారు వేగంగా పది మీటర్ల దూరం పల్టీలు కొడుతూ వెళ్లి రెయిలింగ్‌ను ఢీ కొంది. వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న ఓఆర్‌ఆర్‌ పెట్రోల్‌ సిబ్బంది కారు వెనుక సీటులో ఉన్న కిరణ్, రోహిత్‌ను బయటకు తీసి.. అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు.

కారు నడుపుతున్న సూర్యతేజ, పక్కన కూర్చున్న రవితేజ ఘటనా స్థలంలోనే కన్నుమూశారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ రోహిత్‌ కూడా మృతిచెందాడు. తీవ్ర గాయాలపాలైన కిరణ్‌ నాంపల్లి కేర్‌ ఆస్పత్రిలో ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు. పోస్టుమార్టం అనంతరం ముగ్గురి మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించారు. నలుగురు స్నేహితులు అవివాహితులే. నిన్నటి వరకు తమతో ఉన్న ముగ్గురు స్నేహితులు రోడ్డు ప్రమాదంలో మృతిచెందారన్న విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, బంధువులు ఉస్మానియా మార్చురీకి చేరుకున్నారు. మృతదేహాలను చూసి కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదించడం అందరినీ కంటతడి పెట్టించింది. కాగా, ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మితిమీరిన వేగం.. నిర్లక్ష్యపూరిత డ్రైవింగ్‌ వల్లే ప్రమాదం జరిగినట్లు పోలీసులు పేర్కొంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement