‘ముసద్దీలాల్’కు చెందిన ఖాతాలు ఫ్రీజ్
దర్యాప్తు ముమ్మరం చేసిన సీసీఎస్ అధికారులు
సాక్షి, హైదరాబాద్: పెద్ద నోట్ల రద్దు ప్రకటన వెలువడిన నవంబర్ 8వ తేదీ రాత్రి నుంచి 9వ తేదీ తెల్లవారుజాము వరకు రూ.100 కోట్లకు పైగా వ్యాపారం చేసిన ముసద్దీలాల్ జెమ్స్ అండ్ జ్యుయెలర్స్ ప్రైవేట్ లిమిటెడ్, దాని అనుబంధ సంస్థ వైష్ణవి బులియన్ ప్రైవేట్ లిమిటెడ్‌పై నమోదైన కేసు దర్యాప్తును నగర నేర పరిశోధన విభాగం(సీసీఎస్) ముమ్మరం చేసింది. శుక్రవారం వరకు వీటికి చెందిన మొత్తం 14 బ్యాంకు ఖాతాలను సీసీఎస్ అధికారులు ఫ్రీజ్ చేశారు. ఆదాయ పన్ను శాఖ అధికారుల ఫిర్యాదు మేరకు జూబ్లీ హిల్స్ ఠాణాలో నమోదైన కేసు సీసీఎస్‌కు బదిలీ అయింది. ఆరోపణలు ఎదుర్కొంటు న్న రెండు సంస్థలూ బంజారాహిల్స్ రోడ్ నం.2లోని ఒకే ప్రాంగణంలో ఉన్నాయి. ఈ సంస్థలకు చెందిన డైరెక్టర్లు నితిన్ గుప్తా, సీరా మల్లేష్, నరేంద్రజి గెల్లబోయిన, వినూత బొల్ల నిందితులుగా ఉన్నారు.
8 గంటల్లో 100 కోట్ల వ్యాపారం
పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని కేంద్రం నవంబర్ 8వ తేదీ రాత్రి వెల్లడించింది. ఎక్కువ ధరకు బంగారం కొనుగోలు చేయ డానికి సిద్ధమైన వారి నుంచి రద్దయిన పాత నోట్లను తీసుకో వడానికి సిద్ధమైన ఈ రెండు సంస్థల యాజ మాన్యాలూ అక్రమ వ్యాపారానికి తెరలేపా యి. 8వ తేదీ రాత్రి నుంచి 9వ తేదీ తెల ్లవారు జాము వరకు 8 గంటల వ్యవధి లోనే 5,200 మంది వినియోగదారులకు రూ.100 కోట్ల విలువ చేసే ఆభరణాలను విక్రయించి నట్లు ఈ సంస్థలు రికార్డులు రూపొందించా యి. ముసద్దీలాల్ జ్యువెల్లర్స్ యాజమాన్యం పంజ గుట్టలోని ఎస్‌బీఐ బ్రాంచ్‌లో నవంబర్ 10న రూ.57.85 కోట్లు, 11న రూ.24.8 కోట్లు, 15న రూ.27.2 కోట్లు పెద్దనోట్లను జమ చేసింది. వైష్ణవి బులియన్ జూబ్లీహిల్స్ యాక్సిస్ బ్యాం కులో గత నెల 10న ఓ కొత్త అకౌంట్ తెరిచి రూ.40 కోట్ల పాతనోట్లను జమ చేసింది.
వివిధ ఖాతాలకు నిధుల మళ్లింపు
ఎస్బీఐలో జమ చేసిన రూ.57.85 కోట్లను మసద్దీలాల్ యాజమాన్యం వివిధ బ్యాంకు ఖాతాల్లోకి బదిలీ చేసింది. నవంబర్ 11–23 తేదీల మధ్య ఈ నగదును దాదాపు 31 దఫాలుగా వివిధ ఖాతాల్లోకి మార్చారని సీసీఎస్ గుర్తిం చింది. శ్రీబాలాజీ గోల్డ్, ఎంఎస్ ఇంప్లెక్స్, వైష్ణవి బులియన్ ప్రైవేట్ లిమిటెడ్ తది తర కంపెనీల పేర్లతో ఉన్న ఖాతాల తోపాటు డైరెక్టర్ నితిన్ వ్యక్తిగత ఖాతా లోకీ మళ్ళించారని తేలింది. యాక్సిస్ బ్యాంక్‌లో డిపాజిట్ చేసిన రూ.40 కోట్ల నగదును అష్టలక్ష్మీ గోల్డ్ ఖాతాలోకి బదిలీ చేశారు. దీని నుంచి 36 దఫాల్లో బ్యాంకు ఖాతాల్లోకి మళ్లించారు. ఒక్కో ఖాతాలోకి కనిష్టంగా రూ.99 లక్షల నుంచి గరిష్టంగా రూ.4 కోట్ల వరకు బదిలీ చేసినట్లు సీసీ ఎస్ అధికారులు గుర్తించారు. నగదు బది లీ అయిన ఖాతాలపై ఆరా తీస్తున్నారు.