
డీజీపీని కలసిన గద్దర్
సాక్షి, హైదరాబాద్: ప్రజాకవి గద్దర్ డీజీపీ అనురాగ్‌శర్మను మంగళవారం పోలీసు ప్రధాన కార్యాలయంలో కలిశారు. 1997లో తనపై జరిగిన కాల్పుల ఘటనపై పునర్విచారణ జరిపించాలని ఆయన కోరారు. ఈ మేరకు డీజీపీకి ఒక వినతిపత్రం అందజేశారు. 1997లో సికింద్రాబాద్ అల్వాల్‌లోని తన నివాసంలో గద్దర్‌పై గ్రీన్‌కోబ్రా పేరిట గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. అయితే ఈ కాల్పులకు పాల్పడింది నయీమ్ ముఠానేనని అప్పట్లో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఈ ఘటనపై విచారణ నిమిత్తం అప్పటి డీజీపీ హెచ్.జె.దొర ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు చేశారు.
కానీ దర్యాప్తులో కాల్పులకు పాల్పడిన వ్యక్తులెవరనేది తెలియలేదు. ఇటీవల గ్యాంగ్‌స్టర్ నయీమ్ పోలీసుల ఎన్‌కౌంటర్‌లో మృతి చెందడంతో ఈ కేసు మరోసారి తెరపైకి వచ్చింది. గ్రీన్‌కోబ్రా, బ్లాక్ కోబ్రాల పేరిట నయీమ్ అరాచకాలు సృష్టించినట్లు అనేక బాగోతాలు వెలుగు చూస్తున్నాయి. ఈ నేపథ్యంలో తనపై జరిగిన కాల్పుల ఘటనపై పునర్విచారణ జరిపితే వాస్తవాలు వెలుగు చూసే అవకాశం ఉందని గద్దర్ డీజీపీని కోరారు.