బ్రహోత్సవాల సందర్భంగా శ్రీవారికి ధరింపజేసే ఎరవాడ జోడు పంచెల నేత పూర్తయింది. గద్వాల సంస్థానాధీశుల కాలం నుంచి తిరుమల తిరుపతి శ్రీనివాసుడి బ్రహ్మోత్సవాలకు నియమ నిష్టలతో నేత కార్మికులు గద్వాల ఎరవాడ జోడు పంచెలను అందజేయడం సంప్రదాయంగా కొనసాగుతోంది. నాటి నుంచి వస్తున్న ఆచారం మేరకు మహబూబ్‌నగర్ జిల్లా గద్వాలలో చేపట్టిన శ్రీవారి ఎరవాడ జోడు పంచెల నేత గురువారం పూర్తయింది. అక్టోబర్ 3 నుంచి 11వరకు జరిగే దసరా బ్రహ్మోత్సవాలలో భాగంగా మొదటి రోజు శ్రీవారి అలంకరణకు గద్వాల ఎరవాడ జోడు పంచెలను ధరింపజేస్తారు. గద్వాల సంస్థానాదీశురాలు శ్రీలతాభూపాల్ లేఖను తీసుకొని శుక్రవారం తిరుపతికి వెళ్లి శ్రీవారి పంచెలను అక్కడి పేష్‌కార్‌కు అప్పగించనున్నట్లు పంచెల తయారీ నిర్వాహకుడు మహంకాళి కర్ణాకర్ తెలిపారు. 41 రోజులుగా నిష్టతో శ్రీవారి ఎరవాడ జోడు పంచెలను ఐదుగురు చేనేత కార్మికులు పనిచేసి సిద్ధం చేశారు.
గద్వాల రాజుల వారసత్వంగా పంచెల సమర్పణ...
శతాబ్దాలుగా గద్వాల సంస్థానాదీశులు తమ వంశ పెద్దల సంప్రదాయ ఆచారంగా శ్రీ తిరుమలేశుడికి ప్రతిఏటా బ్రహ్మోత్సవాలకు గద్వాల ఎరవాడ జోడు పంచెలను అందజేస్తారు. తిరుమల తిరుపతి బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీనివాసునికి ఉత్సవాల మొదటి శుక్రవారం రోజున, విజయ దశమి రోజున ఈ ఎరవాడ పంచెలను మూలవిరాట్‌కు ధరింప చేస్తారు. గద్వాల సంస్థానాదీశులలో ఒకరైన రాజు సీతారాంభూపాల్ తన వంశస్థుల ఇష్టదైవమైన వెంకటేశ్వరుడికి పంచెలను సమర్పించే కార్యక్రమాన్ని ప్రారంభించారు.
పంచెల విశిష్టత..
ఎరవాడ పంచె 11 గజాల పొడవు, రెండున్నర గజాల వెడల్పు, 15 అంగుళాల వెడల్పుతో అంచుఉంటుంది. శ్రీనివాసుడికి సమర్పించే ఈ పంచెలపై ఎనిమిది కోటకొమ్ములు ఉంటాయి. ఒక్కొక్క పంచె తయారు కావడానికి దాదాపు 20 రోజుల సమయం పడుతుంది. జోడు పంచెలను లింగంబాగ్ కాలనీలోని మహంకాళి కర్ణాకర్ ఇంటిపై ప్రత్యేకంగా నిర్మించిన మగ్గంపై ఐదుగురు నేత కార్మికులు ప్రత్యేక నిష్ట, భక్తి శ్రద్ధలను పాటిస్తూ ఈ పంచెలను సిద్ధం చేశారు. ఎరవాడ పంచెల తయారిలో కార్మికులు గద్దె మురళి, సాక సత్యన్న, దామర్ల శణ్ముఖరావు, కరుణాకర్, మేడం రమేష్‌లు పాల్గొన్నారు.
సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నాం - మహంకాళి కర్ణాకర్
సంస్థానాదీశుల కాలం నుంచి కొనసాగుతున్న సంప్రదాయాన్ని వారి వంశస్తులు కొనసాగింప చేస్తున్నారని, మైసూరు, గద్వాల సంస్థాన దీశులు తిరుమలేషుని సేవకు ప్రత్యేకత ఇచ్చారని మహంకాళి కర్ణాకర్ తెలిపారు. ఐదేళ్లుగా తన నివాసంలో ఈ మహత్తర కార్యక్రమాన్ని చేపడుతున్నందుకు గర్వపడుతున్నానని చెప్పారు. ఈ సేవలో గద్వాల నేత కార్మికులు పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నామని వివరించారు. గద్వాల జిల్లా ఆకాంక్ష నెరవేరాలని ఆ వెంకటేశ్వరస్వామిని వేడుకుంటున్నామని చెప్పారు.
ఏడుకొండల వాడికి గద్వాల పంచెలు కానుక
Published Thu, Sep 8 2016 8:01 PM | Last Updated on Mon, Sep 4 2017 12:41 PM
Advertisement