
నయీమ్ ఉదంతంలో 30 కేసులు
గ్యాంగ్‌స్టర్ నయీమ్ వ్యవహారంలో గురువారం వరకు రాష్ట్రవ్యాప్తంగా 30 కేసులు నమోదు చేసినట్టు సిట్ చీఫ్ నాగిరెడ్డి వెల్లడించారు.
సిట్ చీఫ్ నాగిరెడ్డి
సాక్షి, హైదరాబాద్: గ్యాంగ్‌స్టర్ నయీమ్ వ్యవహారంలో గురువారం వరకు రాష్ట్రవ్యాప్తంగా 30 కేసులు నమోదు చేసినట్టు సిట్ చీఫ్ నాగిరెడ్డి వెల్లడించారు. ఇప్పటిదాకా జరిపిన దర్యాప్తులో వివిధ ప్రాంతాల్లో నయీమ్ అనుచరుల నుంచి భూమి పత్రాలు, ఇళ్ల స్థలాలు, అక్రమ ఆయుధాలు, బంగారు ఆభరణాలు, పేలుడు పదార్థాలు, డబ్బు స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు. గురువారం నయీమ్ అనుచరుడు ఫయాజ్ అలియాస్ అమీర్‌ను శంషాబాద్‌విమానాశ్రయంలో అరెస్టు చేసినట్టు చెప్పారు.
అతని నుంచి తపంచా, మూడు రౌండ్ల తూటాలు స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించామన్నారు. నయీమ్, అతని అనుచ రులకు సంబంధించి ఎలాంటి వందతులనూ ప్రజలు నమ్మొద్దని, మీడియా ప్రచారం చేయొద్దని, ప్రచురించొద్దని నాగిరెడ్డి కోరారు. లేదంటే ప్రజల్లో గందరగోళానికి దారి తీస్తుందన్నారు. బాధితులకు న్యాయం చేసేందుకు సిట్ పక్కా చర్యలు చేపడుతోందని వివరించారు. ఈ విషయంలో అనుమానాలు అక్కర్లేదన్నారు. కేసుకు సంబంధించి ఏ సమాచారాన్నయినా 9440627218 నంబరు ద్వారా సిట్‌కు తెలియజేయాలని కోరారు. సమాచారమిచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలిపారు.
నయీమ్ ఉదంతంలో జిల్లాలవారీగా నమోదైన కేసులు...
నల్గొండ 14, మహబూబ్‌నగర్ 4, సైబరాబాద్ (ఈస్ట్, వెస్ట్) 7, కరీంనగర్ 4, నిజమాబాద్ 1, మొత్తం 30