నయీమ్‌ అనుచరుల్లో గుబులు | SIT Speedup Investigation On Gangster Nayeem Case | Sakshi
Sakshi News home page

నయీమ్‌ అనుచరుల్లో గుబులు

Published Wed, Feb 8 2017 3:21 AM | Last Updated on Tue, Nov 6 2018 4:42 PM

SIT Speedup Investigation On Gangster Nayeem Case

పీడీయాక్ట్‌.. నయీమ్‌ అనుచరుల్లో గుబులు రేపుతోంది. గ్యాంగ్‌స్టర్‌ కేసు దర్యాప్తును పోలీస్‌ యంత్రాంగం ముమ్మరం చేయడం ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కలకలం సృష్టిస్తోంది.  కేసును నీరుగార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని.. సిట్‌పై నమ్మకం లేదంటూ ప్రతిపక్షాలు విమర్శలు చేస్తుండడం.. అదే సమయంలో సీబీఐకి అప్పగించాలనే ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ చర్యలకు ఉపక్రమించినట్లు తెలుస్తోంది.

సాక్షి,యాదాద్రి : గ్యాంగ్‌స్టర్‌ నయీమ్‌ ప్రధాన అనుచరులు మరో ఐదుగురిపై రాచకొండ పోలీసులు పీడీయాక్ట్‌ నమోదు చేశారు. వీరంతా భువనగిరికి చెందినవారే. వీరిలో మున్సిపల్‌ కౌన్సిలర్‌ అబ్దుల్‌ నాసర్, బచ్చు నాగరాజు, కత్తుల జంగయ్య, పులి రాజు, సరిగడ హరిపై  పీడీయాక్ట్‌ నమోదు చేసి అరెస్టు చేశారు. నయీమ్‌ ఎన్‌కౌంటర్‌కు ముందు గత ఏడాది ముఖ్య అనుచరులైన భువనగిరికి చెందిన పాశం శ్రీను, ఎస్‌కె షకీల్, భువనగిరి జెడ్పీటీసీ సందెల సుధాకర్‌పై పీడీయాక్ట్‌ నమోదు అయింది. ఇందులో ఎస్‌కె షకీల్‌ గుండెపోటుతో మృతిచెందారు. కాగా మిగతా ఇద్దరు పీడీయాక్ట్‌తో పాటు పలు కేసుల్లో వరంగల్‌ జైలులో శిక్ష అనుభవిస్తున్నారు.

నయీమ్‌ ఎన్‌కౌంటర్‌ జరిగిన తర్వాత అతని అనుచరులపై సుమారు 174 కేసులు నమోదయ్యాయి. ఇందులో 124 మందిని వివిధ కేసుల్లో పోలీసులు అరెస్టు చేశారు. ప్రధానంగా కిడ్నాప్‌లు, బెదిరింపులు, హత్యలు, భూకబ్జాలు, బలవంతపు వసూళ్లు, అక్రమ ఆయుధాలు సరఫరా చేశారనే అభియోగాలతో పోలీసులు పీడీయాక్ట్‌ ప్రయోగించారు.

ప్రతిపక్షాల విమర్శలు..
నయీమ్‌ కేసును సీబీఐకి అప్పగించాలని ప్రతిపక్షాల నుంచి డిమాండ్‌ వస్తోంది. ఈనేపథ్యంలో ఇటీవల హైకోర్టుకు సిట్‌ అధికారులు సమర్పించిన నివేదికలో గ్యాంగ్‌స్టర్‌కు రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు పోలీసు అధికారులతో ఎలాంటి సంబంధాలు లేవని తేల్చేసింది. ఈ నేపథ్యంలో ఇటీవల పలువురు పోలీసు అధికారులు నయీమ్‌తో కలిసి భోజనాలు చేస్తున్న ఫొటోలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొట్టాయి. దీంతో మరోసారి నయీమ్‌ కేసు రాష్ట్రస్థాయిలో చర్చనీయాంశంగా మారింది.  ప్రభుత్వం నయీమ్‌ కేసు విషయంలో వెనుకడుగు వేసిందన్న విమర్శ ప్రతిపక్షాలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి నయీమ్‌ కేసులో ఎవరిని వదిలిపెట్టమని స్పష్టం చేసిన విషయం తెలిసిందే.  రాష్ట్ర పోలీసులు బాగా పనిచేస్తున్నారని నయీమ్‌ కేసును సీబీఐకి అప్పగించేదిలేదని తేల్చేశారు.

నిందితులు వీరే
పీడీయాక్ట్‌ నమోదు అయిన వారిలో అబ్దుల్‌ నాసర్‌ టీడీపీ నుంచి కౌన్సిలర్‌గా గెలుపొందారు. పలు కేసుల్లో జైలుకు వెళ్లిన ఆయన జనవరి30న మున్సిపల్‌ సమావేశానికి హాజరై సంతకం చేసి వెళ్లారు. ఈయన నయీమ్‌ ముఖ్య అనుచరుల్లో ఒకరిగా చలామణి అయ్యారు.

∙కత్తుల జంగయ్య, పులి నాగరాజు ఇద్దరు నయీమ్‌ ప్రధాన అనుచరుడు పాశం శ్రీనుకు అనుచరులుగా ఉన్నారు. పాశం శ్రీను చెప్పినట్లుగా వ్యాపారుల వద్దకు వెళ్లి నయీమ్‌ బెదిరింపులకు డబ్బులు తేవడం, బాధితులకు ఫోన్లు చేసి బెదిరించడం వీరి ప్రధాన వృత్తి.   

బచ్చు నాగరాజు ఓ సెల్‌ ఫోన్‌ షాపును నిర్వహిస్తుంటాడు. నాగరాజు తన షాపుకు వచ్చే వారి వివరాలతో కొత్త సిమ్‌ కార్డులను తీసుకుని నేరుగా పాశం శ్రీనుకు అందజేస్తాడు. దీంతో అ సీమ్‌ కార్డులు నేరుగా నయీం వద్దకు వెళ్తాయి. అ సీమ్‌ కార్డులను అనుచరుల వద్ద ఉంటాయి. ఇందులో భాగంగానే బచ్చు నాగరాజును పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించి జైలుకు పంపారు.

సరగడ హరి పట్టణంలోని గంజ్‌మార్కెట్‌కు వెళ్లే ఓ ఆలయం వద్ద ఉంటూ పూజలు చేస్తుంటాడు. ప్రధానంగా గంజ్‌మార్కెట్‌లో డబ్బులు ఎక్కువగా ఉండే షాపుల యాజమానుల వివరాలు తెలుసుకుని నేరుగా నయీమ్‌కు చేరవేస్తాడని పోలీసులు పీడీయాక్ట్‌ నమోదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement