మూడు రోజుల్లో తాఖీదులు.. | Gangster Nayeem case In acquires the Main consequences | Sakshi
Sakshi News home page

మూడు రోజుల్లో తాఖీదులు..

Published Tue, Sep 27 2016 3:29 AM | Last Updated on Tue, Nov 6 2018 4:42 PM

మూడు రోజుల్లో తాఖీదులు.. - Sakshi

మూడు రోజుల్లో తాఖీదులు..

గ్యాంగ్‌స్టర్ నయీమ్‌తో అంటకాగిన వారి పాపం పండబోతోంది... ఎన్‌కౌంటర్ జరిగిన దాదాపు రెండు నెలల తర్వాత కీలక ఘట్టానికి...

గ్యాంగ్‌స్టర్ నయీమ్ కేసులో చోటు చేసుకోనున్న కీలక పరిణామాలు
పోలీసు, రాజకీయ నాయకులకు నోటీసులు ఇచ్చేందుకు రంగం సిద్ధం
బలమైన ఆధారాలు సేకరించిన సిట్ అధికారులు
నయీమ్ కుడిభుజం శేషన్న ముఖ్య అనుచరుడు ఈశ్వరయ్య అరెస్టు    
ఇప్పటి వరకు 130 కేసులు, 93 మంది అరెస్టు

సాక్షి, హైదరాబాద్: గ్యాంగ్‌స్టర్ నయీమ్‌తో అంటకాగిన వారి పాపం పండబోతోంది... ఎన్‌కౌంటర్ జరిగిన దాదాపు రెండు నెలల తర్వాత కీలక ఘట్టానికి తెరలేవనుంది. ఇప్పటి వరకు నయీమ్ అనుచరుల అరెస్టులకే పరిమితమైన ‘సిట్’... తాజాగా లభించిన కీలక ఆధారాలతో ముందడుగులు వేస్తోంది.

ఇందులో భాగంగా గరిష్టంగా మూడు రోజుల్లో కొందరు రాజకీయ నేతలు, పోలీసు అధికారులకు తాఖీదులు ఇవ్వనుంది. సోమవారం జరిగిన కీలక పరిణా మాలు దీన్ని స్పష్టం చేస్తోంది. నయీమ్ అరాచకాలలో పరోక్ష, ప్రత్యక్ష సహకారం అందించిన ‘ముఖ్య’మైన వారికి నోటీసులు ఇవ్వాలని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) నిర్ణయించింది. ఈ కార్యాచరణను వడివడిగా పూర్తి చేస్తోంది.ఇప్పటికే ‘సిట్’కు ఇద్దరు ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎమ్మెల్సీలు, 21 మంది పోలీసు అధికారులకు  చెందిన స్పష్టమైన ఆధారాలు లభించిన విషయం తెలిసిందే. ఈ మేరకు  సీఎం కె.చంద్రశేఖర్‌రావుకు డీజీపీ అనురాగ్‌శర్మ నివేదికనూ అందజేశారు.

భూకబ్జాలు, బెదిరింపుల్లో నయీమ్‌కు ఎవరెవరు ఎలా సహకరించారో  వివరించారు. అందుకు  మరికొన్ని బలమైన ఆధారాలను కూడా సిట్ సేకరించింది. ఈ మేరకు తొలి విడతలో ఒక ఎమ్మెల్సీ, నలుగురు పోలీసు అధికారులకు నోటీసులు ఇవ్వాలని ‘సిట్’ యోచిస్తోంది. దీనిపై ఆ ఎమ్మెల్సీకి సోమవారం స్పష్టమైన సంకేతాలను పంపారు. రెండు, మూడు రోజుల్లో నోటీసులు ఇవ్వనున్నట్లు, సిద్ధంగా ఉండాలని సూచించారు. అలానే నోటీసులు అందుకోబోతున్న పోలీసు అధికారులకు కూడా సంకేతాలందాయి. రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో కొందరు అదనపు ఎస్పీలకు నాన్‌క్యాడర్ ఎస్పీ హోదా ఇవ్వాలని నిర్ణయించారు. ఆ లిస్టులో అర్హతలున్నా ముగ్గురు ఏఎస్పీలను... కేవలం నయీమ్ కేసుల నేపథ్యంలో పక్కన పెట్టారు. కనుక వారికీ నోటీసులిచ్చి విచారించాలని సిట్ భావిస్తున్నట్లు సమాచారం.
 
తాజాగా మరికొన్ని ఆధారాలు
నయీమ్‌తో చెట్టాపట్టాలేసుకొని తిరిగిన రాజకీయ నేతలు, పోలీసులకు చెందిన మరికొన్ని బలమైన ఆధారాలు లభ్యమయ్యాయి. ఇది వరకే కొన్ని ఫొటోలు వెలువడగా... తాజాగా భూ లావాదేవీల లింకులు, కొన్ని పత్రాలు బయటపడ్డాయి. కొందరు బాధితులిచ్చిన ఫిర్యాదులతో పాటు తదుపరి కస్టడీలో భాగంగా నిందితులు చెప్పిన వివరాలపై దర్యాప్తు చేయగా అవి వెలుగు చూశాయి. ఇటీవల స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల శాఖ అందజేసిన వివరాలూ వాటిని రూఢీ చేశాయి. ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులు, వారికి చెందిన వ్యక్తుల భూ బాగోతాలను రిజిస్ట్రేషన్లశాఖ అందజేసింది. నేతలు, అధికారులు తమ కుటుంబ సభ్యులతో పాటు అనుచరుల పేరిట ఈ లావాదేవీలు జరిపినట్లు తేలింది. వీటి ఆధారంగా సిట్ ఉచ్చుబిగిస్తోంది.
 
శేషన్న ముఖ్య అనుచరుడి అరెస్టు..
నయీమ్ కుడి భుజంగా పేరొందిన శేషన్న ముఖ్య అనుచరుడు ఈశ్వరయ్యను సిట్ సోమవారం అరెస్టు చేసింది. మహబూబ్‌నగర్‌కు చెందిన ఈశ్వరయ్యను 15రోజుల క్రితమే పోలీసులు తమ అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. రెండు రోజుల క్రితం ఈశ్వరయ్య ఇంటి నుంచి మహబూబ్‌నగర్ జిల్లా పోలీసులు కొన్ని ఆధారాలను సేకరించారు. ఇతని ద్వారా తప్పించుకొని తిరుగుతున్న శేషన్న  వివరాలు రాబట్టినట్లు తెలిసింది. నయీమ్ డెన్‌ల వివరాలను కూడా  రాబట్టినట్లు సమాచారం. ఇలా ఇప్పటి వరకు నయీమ్ ముఠాపై రాష్ట్ర వ్యాప్తంగా 130కేసులు నమోదవ్వగా... 93 మంది అరెస్టయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement