‘అనుచరుల’ అరాచకాలు ఎన్నెన్నో..!
ఆలస్యంగా వెలుగు చూస్తున్న నయీమ్ గ్యాంగ్ ఆగడాలు
ఇబ్రహీంపట్నం రూరల్: గ్యాంగ్‌స్టర్ నయీమ్ ఎన్‌కౌంటర్‌తో రాష్ట్రంలో అతని బారిన పడిన బాధితులు ఒక్కొక్కరూ బయటకు వస్తున్నారు. ఇన్నాళ్లుగా నయీమ్ అరాచకాలకు అధికార, రాజకీయ పక్షాల మద్దతు ఉండడంతో అతని అనుచరుల ఆగడాలకు అంతులేకుండా పోయింది. పిక్నిక్‌ల పేరుతో స్త్రీలు.. చిన్న పిల్లలను తీసుకు రావడం.. భూములు చూడడం.. మరుసటి రోజే ఆ భూముల కబ్జాకు పన్నాగం పన్నడం అతడి అనుచరుల పని. భూమి ఎవరిదైనా కాజేయడమే పనిగా పెట్టుకున్నారు. ఎక్కువ మాట్లాడితే చస్తావా.. భూమి ఇస్తావా అంటూ తుపాకులు పెట్టి భయాభ్రాంతులకు గురి చేసేవారు. ‘‘వ్యవసాయం చేసుకుని బతికేటోళ్లం.. మా భూములపై పడొద్దు.. మీకు దండం పెడ్తాం’’ అన్నా కనికరించే వారు కాదు.
ప్రభుత్వాధికారులు, పోలీసుల అండదండలతో కబ్జా రాజ్యాలకు తెరతీశారు. నయీమ్ బతికి ఉన్నన్ని రోజులు కోట్ల విలువ చేసే భూములపై కన్నేసి కబ్జా చేసి తమను తీవ్ర ఇబ్బందులు పెట్టారని రైతులు వాపోతున్నారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని ఆదిభట్ల గ్రామంలో ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ ఉన్న భూములపై నయీమ్ అనుచరులు కన్నేశారు. వివాదంలో ఉన్న స్థలాలు కొనుగోలు చేసి పక్కన ఉన్న రైతులను ఇబ్బంది పెట్టేవారు. ఆదిభట్లలో బురుగు పెద్ద వెంకట్‌రెడ్డి, చిన్న వెంకట్‌రెడ్డి, పురుషోత్తంరెడ్డికి చెందిన సర్వే నంబర్ 490, 410లో 8 ఎకరాల భూమి ఉందని చాలా రోజులుగా వారిని చిత్రహింసలకు గురి చేశారు. 2013 నుంచి ఇప్పటి వరకు కోర్టుల చుట్టూ తిప్పుతున్నారు. నయీం ప్రధాన అనుచరులుగా చెప్పుకుంటున్న సామ సంజీవరెడ్డి, శ్రీహరి, అడ్వొకేట్ తులసీదాస్ తమను చిత్రహింసలకు గురి చేశారని రైతులు వాపోయారు. చాలామందిని వీరి వల్ల ఇబ్బందులు పడ్డారని.. త్వరలో వారంతా బయటకు వస్తారని చెప్పారు.