
ఆస్తి పన్నుపై జీఐఎస్ కన్ను..!
♦ సాంకేతిక పరిజ్ఞానంతో ఆస్తి పన్ను ఎగవేతకు చెక్
♦ తొలి విడతగా రాష్ట్రంలోని 8 మున్సిపాలిటీల్లో అమలు
♦ పన్ను పరిధిలోకి రాని భవనాల గుర్తింపు ఇక సులభం
సాక్షి, హైదరాబాద్: ఆస్తి పన్ను చెల్లింపునకు ఎగనామం పెడితే.. ‘శాటిలైట్ కన్ను’ ఈజీగా పట్టేయనుంది. ఆస్తి పన్నుల గణన, వసూళ్లలో లోపాలను నివారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం జియోగ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టం(జీఐఎస్) ఆధారిత మ్యాపులను ఉపయోగించబోతోంది. నగర, పట్టణ ప్రాంతాల్లోని ఇళ్లు, భవనాలు, వాణిజ్య సముదాయాల ఆస్తి పన్ను గణన కోసం తొలిసారిగా ఈ విధానాన్ని ప్రవేశపెట్టబోతోంది. తొలుత ప్రయోగాత్మకంగా రాష్ట్రంలోని 8 మున్సిపాలిటీల్లో ఈ విధానాన్ని సర్కారు అమలు చేయనుంది. ఆస్తి పన్నుల గణన జరగని భవనాలను గుర్తించి.. ఆస్తి పన్నుల పరిధిలోకి తేవడంతో పాటు ఉండాల్సిన మొత్తం కన్నా తక్కువ ఆస్తి పన్ను గల భవనాలను గుర్తించి పునఃగణన నిర్వహించేందుకు ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించనుంది.
తొలివిడతగా ఖమ్మం, కరీంనగర్, నిజామాబాద్ కార్పొరేషన్లతో పాటు మిర్యాలగూడ, సూర్యాపేట, సిరిసిల్ల, సిద్దిపేట, మహబూబ్‌నగర్ మున్సిపాలిటీల్లో జీఐఎస్ ఆధారిత ఆస్తి పన్నుల గణనను త్వరలో ప్రారంభించేందుకు రాష్ట్ర పురపాలక శాఖ సిద్ధమైంది. ఈ మున్సిపాలిటీల కమిషనర్లకు ఈ నెల 13న హైదరాబాద్‌లో అవగాహన సదస్సును తలపెట్టింది. ఆస్తి పన్ను గణనలో లోపాల కారణంగా ఆస్తి పన్ను పరిధిలోకి రాని భవనాలు, చెల్లించాల్సిన మొత్తం కన్నా తక్కువ పన్ను చెల్లిస్తున్న భవనాలు రాష్ట్రంలో వేల సంఖ్యలో ఉంటాయని విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం సర్వేల్లో తేలింది. దీంతో మున్సిపాలిటీలకు ఏటా కోట్లాది రూపాయల ఆదాయానికి గండిపడుతోంది. ఇకపై కచ్చితంగా అన్ని వర్గాల నుంచి ముక్కుపిండి ఆస్తి పన్ను వసూళ్లు జరిపేందుకే ప్రభుత్వం ఈ కొత్త విధానాన్ని ప్రవేశపెట్టబోతోంది. దశలవారీగా రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లోనూ దీనిని అమలు చేయనుంది.
గణన ఇలా...
తెలంగాణ మున్సిపల్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టు కింద ప్రపంచ బ్యాంకు నిధులతో రాష్ట్రంలోని అన్ని నగరాలు, పట్టణాలకు సంబంధించిన జీఐఎస్ ఆధారిత మ్యాపులను రాష్ట్ర పురపాలక శాఖ రూపొందిస్తోంది. ఉపగ్రహాల సహాయంతో తీసిన భూఉపరితల చిత్రాలను క్రోడీకరించి ఆయా నగరాలు, పట్టణాల పటాలను తయారు చేస్తున్నారు. ఇప్పటికే పలు పట్టణాలకు సంబంధించిన జీఐఎస్ మ్యాపులు సిద్ధమయ్యాయి.
పట్టణంలోని ఏ ప్రాంతంలో ఏ భవనం, ఏ రోడ్డు, ఏ మురికి కాల్వ ఎక్కడ ఉందో తెలుసుకునేలా సూక్ష్మమైన సమాచారం వీటిలో కనిపించనుంది. ఆస్తి పన్ను గణన జరగని భవనాలను గుర్తించేందుకు ఇవి ఉపయోగపడనున్నాయి. అలాగే భవన నిర్మిత ప్రాంతం(ప్లింత్ ఏరియా) ఎంతో ఈ ఉపగ్రహ చిత్రాలు చెప్పేయనున్నాయి. భవన వాస్తవ నిర్మిత ప్రాంతం, ఆస్తి పన్ను పరిధిలో ఉన్న ప్రాంతాన్ని పోల్చి చూడనున్నారు. ఒక వేళ తక్కువ ప్రాంతానికి ఆస్తి పన్ను చెల్లిస్తున్నట్లు గుర్తిస్తే ఆయా భవనాలకు కొత్తగా కొలతలు స్వీకరించి ఆస్తి పన్ను గణన నిర్వహించనున్నారు. గణన అనంతరం పెరిగిన ఆస్తి పన్నులకు సంబంధించిన డిమాండ్ నోటీసులను యజమానులకు అందజేస్తారు.