జీవో 214ను రద్దు చేయాలి: లెఫ్ట్
సాక్షి, హైదరాబాద్: ప్రాజెక్టులు, పరిశ్రమల కోసం జరిపే భూసేకరణ సందర్భంగా పునరావాస హక్కును కాలరాసే విధంగా ఉన్న జీవో 214ను రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని వామపక్షాలు డిమాండ్ చేశాయి. ఈ జీవోను రద్దు చేసి నిర్వాసితులకు న్యాయం చేసే విధంగా ఉత్తర్వులు జారీ చేయకపోతే ఉద్యమం తప్పదని హెచ్చరించాయి. సోమవారం మఖ్దూంభవన్‌లో చాడ వెంకటరెడ్డి(సీపీఐ), తమ్మినేని వీరభద్రం(సీపీఎం), వేములపల్లి వెంకట్రామయ్య(న్యూడెమోక్రసీ-రాయల), రాజేష్(లిబరేషన్) విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నిర్వాసితులకు భూములిచ్చి ఇళ్లు కట్టించి ఇచ్చే సామాజిక బాధ్యత నుంచి తప్పించుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని తమ్మినేని విమర్శించారు.
బాధితుల పునరావాస ప్యాకేజీని గాలికి వదిలేయడంతో నిర్వాసితుల బతుకులు బజార్లో పడే పరిస్థితి ఏర్పడిందని చాడ అన్నారు. ఆశా వర్కర్ల పాదయాత్ర ఈ నెల 16న హైదరాబాద్‌కు చేరుకునేలోగా వారి సమస్యలను పరిష్కరించాలన్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో వామపక్షాలు ఐక్యంగా పనిచేయాలని నిర్ణయించినట్లు,ఈ నెల 21న వామపక్ష, ప్రజాతంత్ర, సామాజిక వేదికను ఏర్పాటు చేయనున్నట్లు చాడ, తమ్మినేని తెలిపారు.