నయా సాల్.. గోవా టూర్
న్యూ ఇయర్.. కామన్ పీపుల్‌కి పబ్బులు, క్లబ్బులు, రిసార్టులు, రెస్టారెంట్లను తలచుకొనే, వీలైతే వాటిని కలుసుకునే సందర్భం. కానీ సిటీలోని పార్టీ వెన్యూలు చూసి.. చూసి.. వెళ్లి విసిగిపోయిన వారికి మాత్రం టూర్ టైమ్. పండగ పూట కూడా పాత వంటేనా.. అనే ఫీలింగ్‌తో కొత్త ఏడాదికి వెల్‌కమ్ చెప్పడానికి ఏ ఊరెళ్లాలా అని ప్లాన్ చేసుకుంటారు పార్టీ యానిమల్స్. బృందాలుగా సెలబ్రేషన్స్‌కు చెక్కేసే వారి అభిరుచులకు అనుగుణంగా ఆఫర్లతో సిద్ధంగా ఉంటారు టూర్ ఆపరేటర్స్.
- ఎస్.సత్యబాబు
గోవాలో పాపులరైన ‘సన్‌బర్న్’ పార్టీ.... పార్టీ ప్రియుల ఆకాంక్షలకు రెక్కలొచ్చాయి. నిబంధనలు, తనిఖీల మధ్య చేసుకునే పార్టీలంటే విసిగి పోతున్నారు. అలాంటి వారికి స్వేచ్ఛగా, యథేచ్ఛగా విహరించే అవకాశాన్ని అందిస్తూ.. ఆహ్వానించే ఏకైక గమ్యంగా స్థిరపడిపోతోంది గోవా.
రావా అంటున్న గోవా..
చుట్టూ సముద్రం, దాని మీద తేలియాడే క్రూయిజ్ కేసినోలు.. దేశ విదేశీ పర్యాటకుల ప్రవాహం.. బీర్లనూ, మనసులనూ పొంగించే బీచ్ ఫెస్టివల్స్.. ఎక్సైజ్ పన్ను మినహాయింపు పుణ్యమాని తక్కువ ధరల్లో లభించే ‘కిక్కు’.. ఇంకేం కావాలి? అందుకే సిటీలోని పేజ్‌త్రీ పీపుల్, సోషలైట్స్, సినీ సెలబ్రిటీలు మొత్తం గోవాకే జై కొడుతున్నారు.
పాకెట్ ఫ్రెండ్లీ..
‘సిటీలోని సిసిలైన పార్టీ లవర్స్‌లో 90 శాతం గోవాలోనే ఉంటారు. కాస్త ట్రెడిషనల్‌గా ఉండేవారు మాత్రమే ఇక్కడ సెలబ్రేట్ చేసుకుంటారు’ అని చెప్పారు డీజే మూర్తి. దాదాపు 20 ఏళ్లుగా సిటీలో డీజేగా చేస్తున్న మూర్తి.. గత కొన్నేళ్లుగా క్రమం తప్పకుండా గోవాలోనే ప్లే చేస్తున్నారు. ఈసారి కూడా మరో రెండ్రోజుల్లో గోవా వెళ్తానని చెప్పారు. కాస్త సమయం ఉన్నవారు క్రిస్మస్‌కు సైతం గోవాలోనే ఉండేలా ప్లాన్ చేసుకుంటుంటే, కొందరు నెలాఖరున వెళ్లి రెండ్రోజులకే పరిమితమవుతున్నారు. ‘సిటీలో స్టార్ హోటల్‌లో న్యూ ఇయర్ ఈవెంట్ అంటే కపుల్ పాస్ కనీసం రూ.15 వేలు. దాదాపు అంతే మొత్తంలో గోవా వెళ్లి వచ్చేయొచ్చు’అని చెప్పారు ఐటీ ఉద్యోగి కిరణ్.
ట్రావెలర్స్ క్యూ..
కిరణ్ లాంటి వాళ్లకు గోవా టూర్‌ని ఇలా పాకెట్ ఫ్రెండ్లీగా మార్చడమనే ఘనత టూర్ ఆపరేటర్లకే దక్కుతుంది. న్యూ ఇయర్ టైమ్‌లో గో... గోవా అంటూ హుషారుగా సాగిపోయేవారు పెరుగుతుండడంతో ఆపరేటర్లు ఆఫర్ల వర్షం కురిపిస్తున్నారు. నూతన సంవత్సరారంభ వేళ.. సముద్ర తీర సంబరాల్లో మునిగితేలేందుకు.. సిటీ నుంచి అక్కడికి వెళ్లి రావడానికి అయ్యే ఖర్చు ఎంతో తెలుసా? రూ.5600 మాత్రమే చెల్లిస్తే సరిపోతుందని.. అది కూడా అక్కడ బస, ఆహారంతో కలిపి అని సిటీకి చెందిన పవన్ తేజ టూర్స్ అండ్ ఆపరేటర్స్ నిర్వాహకులు చెప్తుంటే ఆశ్చర్యమనిపించక మానదు. ఇలాంటి ఆకట్టుకునే ఆఫర్లతో సిటీజనుల్ని గోవాకు పరుగులు పెట్టిస్తున్నారు ఆపరేటర్లు.
ఫుల్ డిమాండ్
సిటీ నుంచి గోవాకు న్యూ ఇయర్ టైమ్‌లో ఉన్నంత రద్దీ మరెప్పుడూ ఉండదు. టూర్ ఆపరేటర్లు ఈ
క్రేజ్‌ను తమకు యూజ్‌ఫుల్‌గా మార్చుకోవాలని ప్రయత్నిస్తారు. ఈ సీజన్‌లో గోవాకు అతి తక్కువ ఖరీదులో ట్రిప్ అందిస్తున్న టూర్ ఆపరేటర్స్ మేమే అని ధైర్యంగా చెప్పగలం. కేవలం రూ.6 వేలలోపే గోవాకి రాకపోకలు, బస అన్నీ కలిపి అందిస్తున్నాం.
- వి.రాజశేఖర్‌రావు, ఎండీ, వింగో వెకేషన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్