'అమరావతి'కి తలా రూ.10 ఇవ్వండి..
- రాజధాని నిర్మాణం కోసం విద్యార్థుల నుంచి విరాళాలు కోరిన ప్రభుత్వం
- సేకరణ బాధ్యతలు డీఈవోలకు అప్పగిస్తూ జీవో జారీ
హైదరాబాద్: రాజధాని భూములను విదేశీ ప్రైవేటు సంస్థలకు ధారాదత్తం చేయాలని భావిస్తోన్న చంద్రబాబు ప్రభుత్వం.. ఇప్పుడు అమరావతి నిర్మాణం కోసమని విద్యార్థుల నుంచి విరాళాలు సేకరించాలని నిర్ణయించింది. ఈ మేరకు సోమవారం అన్ని జిల్లాల డీఈవోలకు ఆదేశాలు జారీచేసింది. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం..
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు విధిగా రూ. 10 విరాళాన్ని ఇవ్వాలి. విద్యార్థులే కాదు ఉపాధ్యాయులు కూడా తప్పనిసరిగా విరాళం ఇవ్వాల్సిందే. విరాళాలు సేకరించే బాధ్యత డీఈవోలది. ఒక్క పాఠశాలలే కాక ప్రభుత్వ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థుల నుంచి కూడా విరాళం సేకరించాలని ప్రభుత్వం తన ఆదేశాల్లో పేర్కొంది.
అన్ని స్థాయిల్లో కలిపి ఏపీలో దాదాపు 50 లక్షల మంది విద్యార్థులున్నారు. వీరిలో చాలా మంది నిరుపేద విధ్యార్థులకు ప్రభుత్వం ఇచ్చే ఉపకారవేతనమే ఆధారం. ఈ నేపథ్యంలో అమరావతి నిర్మాణం కోసమంటూ విద్యార్థుల నుంచి విరాళాలు కోరడంపై పలువురు విస్మయం వ్యక్తంచేస్తున్నారు.