చేతి వృత్తులపై ప్రభుత్వం నిర్లక్ష్యం: లక్ష్మణ్
► గీత కార్మికులను ఆదుకునే చర్యలేవి?: దత్తాత్రేయ
► ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో గీత కార్మికుల సదస్సు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో చేతి వృత్తులకు, బీసీలకు ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా గుర్తింపు లేకుండా టీఆర్‌ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ విమర్శించారు. బీజేపీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో గీత కార్మికుల సదస్సు హైదరాబాద్‌లో శనివారం జరిగింది. సదస్సులో కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, ఎమ్మెల్సీ ఎన్.రామచందర్‌రావు పాల్గొన్నారు. విద్య, ఉద్యోగాలు, రాజకీయాల్లోనూ బీసీలకు తీరని అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ వస్తే అన్నిరంగాల్లో అభివృద్ధి, మార్పు వస్తుందని ఆశించినా మూడేళ్లలో పరిస్థితి మరింత క్షీణించి పోయిందన్నారు.
బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ బీసీ సబ్‌ప్లాన్ ఊసే ఎత్తడం లేదన్నారు. రాష్ట్రంలో 17 ఫెడరేషన్లు ఉంటే, వాటిని 11కు కుదించారని పేర్కొన్నారు. వాటిలో కొన్నింటికి చైర్మన్లను నామినేట్ చేసినా, వారికి కార్యాలయాలు, కుర్చీలు, నిధుల్లేవని ఆరోపించారు. కల్తీ కల్లు పేరుతో చీప్ లిక్కర్ లాబీకి తలొగ్గి గీత కార్మికులకు అన్యాయం చేయాలని టీఆర్‌ఎస్ ప్రభుత్వం చూస్తోందని విమర్శించారు. రియల్ ఎస్టేట్ పేరుతో అనేక ప్రాంతాల్లో ఈత, తాటి చెట్లను నేలమట్టం చేసినా ప్రభుత్వం చర్యలు తీసుకోవట్లేదని చెప్పారు. ప్రతి గ్రామంలో తాటిచెట్ల పెంపకానికి 5 ఎకరాల భూమిని కేటాయించాలని డిమాండ్ చేశారు. తాటిచెట్లు ఎక్కేవారికి ఆధునిక యంత్రాలు ఇవ్వాలని, కల్లుగీత ఫెడరేషన్‌ను ఏర్పాటు చేయాలని, సమగ్రచట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు.
ట్యాంక్‌బండ్‌పై సర్వాయి పాపన్నగౌడ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. గీతకార్మికుల బతుకులు మారుతాయని వారు ఉద్యమంలో ముందుండి పోరాటం చేశారని బండారు దత్తాత్రేయ అన్నారు. వారిని ఆదుకోవడానికి టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎలాంటి చర్యలనూ తీసుకోవట్లేదన్నారు. నీరా పరిశ్రమ అభివృద్ధికి యువతకు రూ.5 నుంచి రూ.10 కోట్ల దాకా కేంద్రం ఆర్థిక ప్రోత్సాహం ఇస్తోందన్నారు. సదస్సుకు ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కె.నర్సింహ యాదవ్, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కాసం వెంకటేశ్వర్లు, మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్, యువమోర్చా అధ్యక్షుడు భరత్‌గౌడ్ పాల్గొన్నారు.