సాక్షి, సిటీబ్యూరో: రాజీవ్ విద్యామిషన్ నిధులను సొంత అవసరాలకు వాడుకున్న హైదరాబాద్ జిల్లా తాజా, మాజీ కలెక్టర్ల తీరును కొందరు ఉన్నతాధికారులు తీవ్రంగా ఆక్షేపిస్తున్నారు. ‘ఆర్వీఎం నిధులతో కలెక్టర్ల సోకులు’ శీర్షికన శుక్రవారం సాక్షిలో ప్రచురితమైన కథనం హైదరాబాద్ జిల్లా కలెక్టరేట్లో తీవ్ర సంచలనం రేకెత్తించింది. కలెక్టరేట్లోని ప్రతి సెక్షన్లోనూ ఇదే చర్చ కొనసాగింది.
నిధుల దుర్వినియోగానికి సంబంధించిన ఈ వ్యవహారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వద్దకు చేరినట్లు తెలిసింది. ప్రభుత్వ సొమ్ముకు ధర్మకర్తలుగా వ్యవహరించాల్సిన జిల్లా పాలనాధికారులు(కలెక్టర్లు) ఇంటి పనులకంటూ.. దర్జాగా దుబారా చేయడం పట్ల ఆయన సీరియస్‌గా ఉన్నట్లు సమాచారం. ఆర్వీఎం ఎస్పీడీ నివేదిక కారణంగా తమ బండారం బయటపడడంతో ఏంచేయాలో దిక్కుతోచని పరిస్థితిలో తాజా, మాజీ కలెక్టర్లు ఉన్నారు. కలెక్టర్ల సొంత ఖర్చులంటూ.. వ్యక్తిగత సిబ్బంది వివిధ ప్రభుత్వ విభాగాలకు పంపుతున్న బిల్లులు ఎంతవరకు సరైనవనే దానిపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
రూ.10వేలకు నీళ్లు తాగారా!
హైదరాబాద్ జిల్లా కలెక్టర్‌గా సయ్యద్ ఆలీ ముర్తుజా రిజ్వీ గతేడాది జూలై 1వరకు పనిచేశారు. తాను తాగే కప్పు కాఫీకి కూడా ఆయన తన జేబు నుంచే డబ్బులు చెల్లించడం ఆయన నైజం. అలాంటిది.. ఆయన కలెక్టర్‌గా ఉన్న సమయంలో (గతేడాది మే, జూన్ నెలల్లో) క్యాంపు కార్యాలయానికి నెల మంచినీళ్లకు రూ.10వేల చొప్పున ఖర్చు చేశారంటే నమ్మశక్యం కావడం లేదని రెవెన్యూ ఉద్యోగులే ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
వాస్తవానికి కలెక్టర్ ఖర్చులంటూ.. వ్యక్తిగత సహాయకులే ఆయా బిల్లులను వివిధ ప్రభుత్వ విభాగాలకు పంపుతుంటారు. బిల్లులన్నీ కలెక్టర్ సంతకం లేకుండానే వచ్చిన్పప్పటికీ, ఆయా విభాగాల అధికారులు చెల్లింపులు చేస్తున్నారు.
రిజ్వీ హయాంలో..
గతేడాది జూలై 1వరకు కలెక్టర్‌గా పనిచేసిన రిజ్వీ హయాంలోనే నిబంధనలకు విరుద్ధంగా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ల క్యాంపు కార్యాలయాల్లో సిబ్బందికి వేతనాల కింద రూ.72,420, ఆయన వాడిన కారు రిపేర్లకు రూ.22,780లు ఆర్వీఎం నుంచే చెల్లించారు. ఎలక్ట్రికల్, ప్లంబింగ్ పనుల నిమిత్తం రూ.15,466, ఇతర పనులకంటూ రూ.9,850 ఖర్చు చేశారు. మంచినీళ్ల కోసం మే నెలలో రూ.10వేలు, జూన్‌లో రూ.9,240లు ఆర్వీఎం నిధులను చెల్లించారు.
ముఖేష్ హయాంలో...
హైదరాబాద్ జిల్లా కలెక్టర్ ముఖేష్ కుమార్ మీనా గతేడాది జూలై 2న బాధ్యతలు చేపట్టారు. ఈయన హయాంలోనూ.. నిబంధనలకు విరుద్ధంగా.. గత అక్టోబరులో ఆయన ఉంటున్న ఇంటికి కొత్త కిటికీలు, వుడెన్ ఫ్రేమ్‌లు, ఫిట్టింగ్ చార్జీల కింద రూ.57,606లు ఆర్వీఎం నిధులనే వినియోగించారు. అంతకు ముందు రకరకాల పనులంటూ జూలైలో రూ.39,638, వాహనాల ఖర్చు కింద ఆగస్టులో రూ.5,100లు, అక్టోబరులో రూ. 37,870లు ఆర్వీఎం నిధులనే వినియోగించారు.
ఆర్వీఎం నిధుల వాడకంపై రేగిన దుమారం
Published Sat, Jan 18 2014 4:55 AM | Last Updated on Sat, Sep 2 2017 2:43 AM
Advertisement
Advertisement