
పొదుపు బాటలో ప్రభుత్వం
ప్రభుత్వ కార్యాలయాల అద్దెలు.. విదేశీయానాల కట్టడి
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ కార్యాలయాల అద్దెలు, నిర్వహణ ఖర్చులను భారీగా తగ్గిం చాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. గతం లో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది బడ్జెట్‌లో రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికేతర వ్యయాన్ని తగ్గించింది. గతేడాది ప్రణాళికేతర వ్యయం కేటాయింపులు రూ.63 వేల కోట్లు ఉండగా, ఈసారి దానినుంచి రూ.521 కోట్లను తగ్గిం చింది. ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాలు, రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్లు, డీఏ, డీఆర్‌ల పెంపుతో ప్రణాళికేతర వ్యయం పెరగడమే తప్ప తగ్గేందుకు ఆస్కారం లేదు. కానీ ప్రణాళికేతర వ్యయాన్ని కట్టడి చేసి కార్యాలయాల నిర్వహణ ఖర్చులు, అద్దెలు, వాహనాల నిర్వహణ, ఇంధనం, విద్యుత్ బిల్లులు, ఇతరత్రా సాదర ఖర్చులను తగ్గించుకోవాలన్న స్పష్టమైన సంకేతాలను ప్రభుత్వం జారీ చేసింది.
ప్రధానంగా హైదరాబాద్‌తో పాటు అన్ని జిల్లా కేంద్రాల్లోనూ అద్దె భవనాల్లో ఉన్న కార్యాలయాలపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని నిర్ణయించింది. వీటిని ఇతర ప్రభుత్వ భవనాల్లోకి తరలించి రూ.కోట్ల అద్దెను ఆదా చేయాలని భావిస్తోంది. ప్రధానంగా అన్ని జిల్లా కేంద్రాల్లో ప్రభుత్వ కార్యాలయాలేవీ అద్దె భవనాల్లో ఉండకుండా చర్యలు చేపట్టనుంది. జిల్లా కలెక్టరేట్ భవనంలోనే వీటికి సరిపడే వసతిని సమకూర్చాలని నిర్ణయించింది. కొన్ని జిల్లాల్లో కొత్తగా కలెక్టరేట్ భవన సముదాయాన్ని నిర్మించాలని ప్రభుత్వం యోచిస్తోంది. హైదరాబాద్‌లో ప్రస్తుతం ప్రభుత్వ భవనాల్లో ఉన్న ఏపీకి చెందిన కొన్ని కార్యాలయాలు ఈ ఏడాది జూలై నుంచి ఒక్కటొక్కటిగా తరలివెళ్లే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ కార్యాలయాలు ఖాళీ అయిన కొద్ది వాటిని స్వాధీనం చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తోంది.
విదేశీ ప్రయాణాలకు కత్తెర...
మంత్రులు, ఉన్నతాధికారుల విదేశీ పర్యటనల ను వీలైనంతమేరకు కట్టడి చేయనుంది. దుబా రా ఖర్చులు తగ్గించాలంటూ సీఎం కేసీఆర్ ఇచ్చిన ఆదేశాలతో డిసెంబర్ నుంచే ఆర్థిక శాఖ విదేశీ పర్యటనలపై ఆంక్షలు పెట్టిం ది. అత్యవసరమైతే తప్ప అనుమతి ఇవ్వటం కుదరదని అన్ని విభాగాలకు సమాచారం చేరవేసింది.