
గవర్నర్ ‘మిషన్ భగీరథ’ టూర్
నేడు మూడు జిల్లాల్లో నరసింహన్ పర్యటన
పైపులైన్లు, రిజర్వాయర్ పనుల పరిశీలన
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇంటింటి కీ నల్లా ద్వారా సురక్షిత తాగునీటిని అందించాలనే ఉద్దేశంతో యుద్ధప్రాతిపదికన జరుగుతున్న మిషన్ భగీరథ పథకం పనుల పురోగతిని స్వయంగా పరిశీలించేందుకు గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ జిల్లాల పర్యటనకు బయల్దేరుతున్నారు. బుధవారం ఒకే రోజున ఆయన మూడు జిల్లాల్లో పర్యటించనున్నారు. ఉదయం 10.30 గంటలకు హెలికాప్టర్‌లో బయల్దేరి మెదక్ జిల్లా గజ్వేల్, వరంగల్ జిల్లా జనగామ, నల్లగొండ జిల్లా ఆలేరు నియోజకవర్గాల్లో పనులను ఆయన పరిశీలించనున్నారు.
మిషన్ భగీరథ తొలి విడతలో రంగారెడ్డి జిల్లా మేడ్చల్, మెదక్ జిల్లా గజ్వేల్, సిద్దిపేట, దుబ్బాక, వరంగల్ జిల్లా జనగామ, స్టేషన్ ఘన్‌పూర్, పాలకుర్తి, నల్లగొండ జిల్లా ఆలేరు, భువనగిరి, తుంగతుర్తి నియోజకవర్గాలకు తాగునీటి సరఫరా జరగనుంది. ఈ నియోజకవర్గాల్లో ఏప్రిల్ 30 నుంచి ఇంటింటికీ నల్లా నీటిని ఇచ్చేందుకు పనులు జరుగుతున్నాయి. గవర్నర్‌తోపాటు పంచాయతీరాజ్‌శాఖ అధికారులు కూడా ఈ పర్యటనలో పాల్గొననున్నారు.
పర్యటన సాగేదిలా...
బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి ఉదయం 10:30 గంటలకు గవర్నర్ ప్రత్యేక హెలికాప్టర్‌లో బయల్దేరి గజ్వేల్ నియోజకవర్గ పరిధిలోని కోమటిబండ క్రాస్ రోడ్‌కు చేరుకుంటారు. కోమటిబండ గుట్ట సమీపంలోని పైపులైన్ పనులు, రిజర్వాయర్లను పరిశీలించాక అక్కడి నుంచి బయల్దేరి మధ్యాహ్నం 12 గంటలకు కొమురవెల్లి క్రాస్ రోడ్‌కు చేరుకుంటారు. జనగామ నియోజకవర్గ పరిధిలో జరుగుతున్న పనులను పరిశీలిస్తారు. రోడ్డు మార్గంలో తపాస్‌పల్లికి చేరుకొని పైపులైన్ పనులను పరిశీలించనున్నారు. అక్కడి నుంచి గజ్వేల్ సెగ్మెంట్‌లోని రవీంద్రనగర్‌కు చేరుకొని గ్రామంలో పైపులైన్లు, ఇంటింటికీ నల్లా కనెక్షన్లను పరిశీలిస్తారు. మధ్యాహ్నం ఒంటి గంటకు కొండపాకకు వెళ్లి అక్కడ నిర్మించిన వాటర్ సంప్‌ను పరిశీలించి మేడ్చల్ చేరుకుంటారు. మేడ్చల్ వాటర్ సంప్, డబీల్‌పూర్‌లో ఓవర్‌హెడ్ రిజర్వాయర్, మునీ రాబాద్ పైపులైన్‌ను పరిశీలిస్తారు. మధ్యాహ్నం 2.35 గంటలకు తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు.