
‘మిషన్ భగీరథ’ భేష్
► సర్కార్‌కు గవర్నర్ నరసింహన్ కితాబు
► రెండు, మూడేళ్లలో ఇంటింటికీ నల్లా నీరు
► తనిఖీ కాదు.. పరిశీలనకే వచ్చా
► మిషన్ భగీరథ పనుల పరిశీలన
► వరంగల్, మెదక్, రంగారెడ్డి జిల్లాల్లో పర్యటన
గజ్వేల్/మేడ్చల్/సాక్షి ప్రతినిధి, వరంగల్: ‘మిషన్ భగీరథ’ పనులు భేషుగ్గా జరుగుతున్నాయని గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ తెలంగాణ సర్కార్‌కు కితాబిచ్చారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమ పనులను పరిశీలించేందుకు గవర్నర్ బుధవారం వివిధ ప్రాంతాల్లో పర్యటించారు.
వరంగల్, మెదక్, రంగారెడ్డి జిల్లాల్లో పర్యటించిన ఆయన.. భగీరథ పథకం గురించి తనకు రాజ్‌భవన్‌లో కాగితాల ద్వారా, డిజిటల్ ప్రదర్శన ద్వారా వివరించారని చెప్పారు. క్షేత్ర స్థాయిలో పరిస్థితిని ప్రత్యక్షంగా పరిశీలించాలనే జిజ్ఞాసతోనే వచ్చానని, తనిఖీ కోసం వచ్చినట్టుగా భావించవద్దని స్పష్టం చేశారు. రెండు మూడేళ్లలో ప్రభుత్వం ఇంటింటికీ నల్లా నీరు ఇచ్చేందుకు కృషిచేస్తోందన్నారు.
కరువు పరిస్థితులు నెలకొన్న ప్రస్తుత తరుణంలో నీటిని పొదుపుగా వాడుకునే చైతన్యం పెరగాలని, అప్పుడే ప్రభుత్వం చేపట్టిన ఈ పథకానికి సార్థకత చేకూరుతుందన్నారు. తొలుత వరంగల్ జిల్లాలో పర్యటించిన గవర్నర్ మధ్యాహ్నం 12:30 గంటలకు చేర్యాల మండలం కొమురవెల్లి క్రాస్ రోడ్డుకు చేరుకొని అక్కడ నిర్మిస్తున్న ఓవర్ హెడ్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ పనులను పరిశీలించారు. గ్రావిటేషన్ పద్ధతిలో నీటిని ఇంటింటికీ అందించే అంశాలను ఇంజనీరింగ్ అధికారులు ఆయనకు వివరించారు.
గజ్వేల్‌లో...
ఆ తర్వాత గవర్నర్ మెదక్ జిల్లాలోని సీఎం కేసీఆర్ సొంత నియోజకవర్గమైన గజ్వేల్‌లో పర్యటించారు. గజ్వేల్ మండలం కోమటిబండ అటవీప్రాంతం, కొండపాక మండలంలో ‘మిషన్ భగీరథ’ పనులను పరిశీలించారు. ప్రజలకు మంచినీటిని అందించడం ప్రభుత్వాల కనీస బాధ్యత అని, సంక్షేమ కార్యక్రమాలన్నింటిలోనూ ఇదే ప్రధానమైందన్నారు. ఈ కర్తవ్యాన్ని తెలంగాణ ప్రభుత్వం భుజాన వేసుకుందని మెచ్చుకున్నారు.
ఏప్రిల్ ఆఖరులోగా గజ్వేల్ నియోజకవర్గంతోపాటు పలు ప్రాంతాల్లో ఇంటింటికీ నల్లా నీటిని అందించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందన్నారు. అధికారుల పనితీరు కూడా ‘బుల్లెట్ స్పీడ్’ను తలపిస్తోందని కొనియాడారు. కార్యక్రమంలో మెదక్ జిల్లా కలెక్టర్ రోనాల్డ్ రాస్, వాటర్ గ్రిడ్ ప్రత్యేక ముఖ్యకార్యదర్శి ఎస్పీ సింగ్, జెడ్పీ సీఈఓ వర్షిణి, ‘గడా’ ఓఎస్డీ హన్మంతరావు, వాటర్‌గ్రిడ్, ఆర్‌డబ్ల్యూఎస్ ఈఎన్‌సీ సురేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మేడ్చల్‌లో...
మధ్యాహ్నం 2.45 గంటలకు కండ్లకోయలోని సీఎంఆర్ కళాశాల మైదానానికి హెలికాప్టర్‌లో వచ్చిన గవర్నర్ నరసింహన్ రోడ్డు మార్గంలో మేడ్చల్ పట్టణానికి చేరుకున్నారు. ఆయనకు మంత్రి మహేందర్‌రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి స్వాగతం పలికారు. పట్టణంలోని టీటీడీ కల్యాణవుండపం ఆవరణలో నిర్మిస్తున్న సంపు ను పరిశీలించారు. గోదావరి జలాల తరలింపు మ్యాప్‌ను చూసి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. తర్వాత ఎల్లంపేట చౌరస్తాకు చేరుకుని అక్కడ పనులను పరిశీలించి తిరిగి హైదరాబాద్‌కు పయనమయ్యారు.
గవర్నర్‌తో కేసీఆర్ భేటీ
సాక్షి, హైదరాబాద్: గవర్నర్ నరసింహన్‌తో ముఖ్యమంత్రి కేసీఆర్ భేటీ అయ్యారు. బుధవారం సాయంత్రం రాజ్‌భవన్‌కు వెళ్లి న కేసీఆర్ గవర్నర్‌తో దాదాపు గంట సేపు సమావేశమయ్యారు. ఉదయాన్నే 3 జిల్లా ల్లో పర్యటించిన గవర్నర్ వివిధ గ్రామాల పరిధిలో మిషన్ భగీరథ రిజర్వాయర్లు, పైపులైన్ల పనుల పురోగతిని స్వయంగా పరిశీలించారు. తన పర్యటన వివరాలతోపాటు మిషన్ భగీరథ పనుల ప్రగతిపైనే వీరిద్దరి మధ్య చర్చలు జరిగాయి. పనులు జరుగుతున్న తీరుపై గవర్నర్ సంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది.