
మిషన్ భగీరథ పనులను పరిశీలించిన గవర్నర్
గజ్వేల్: ప్రజలకు మంచినీరు అందించడం ప్రభుత్వాల కనీస బాధ్యత అని... ఈ కర్తవ్యాన్ని తెలంగాణ ప్రభుత్వం నెరవేర్చడం హర్షణీయమని గవర్నర్ నరసింహన్ అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలో బుధవారం ఆయన పర్యటించారు.
గజ్వేల్ మండలం కోమటిబండ, కొండపాక మండల కేంద్రాల్లో ‘మిషన్ భగీరథ’ నిర్మాణ పనులను నరసింహన్ పరిశీలించారు. ఈ సందర్భంగా కోమటిబండలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి వాటర్‌గ్రిడ్ సోపానం కాబోతోందన్నారు.
ఈ పథకంపై కాగితాల ద్వారా, డిజిటల్ ప్రదర్శనలతో వివరించినా... క్షేత్రస్థాయిలో పరిస్థితిని ప్రత్యక్షంగా పరిశీలించాలనే ఆసక్తితోనే ఇక్కడికి వచ్చినట్లు తెలిపారు. తన పర్యటనను తనిఖీగా భావించవద్దని ఆయన స్పష్టం చేశారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రోనాల్డ్‌రాస్, వాటర్ గ్రిడ్ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి ఎస్పీ సింగ్, జడ్పీ సీఈవో వర్షిణి పాల్గొన్నారు.