గౌతమీపుత్ర శాతకర్ణిలో కాపీ కొట్టారు
సాక్షి, హైదరాబాద్ సిటీబ్యూరో: గౌతమి పుత్ర శాతకర్ణి చారిత్రక చిత్రంగా పేర్కొనడం దారుణమని హైదరాబాద్ దక్కన్ డెమోక్రటిక్ అలయెన్స్ అధ్యక్షుడు కొల్లూరి చిరంజీవి, వాయిస్ ఆఫ్ తెలంగాణ అధ్యక్షుడు లింగాల పాండు రంగారెడ్డి అన్నారు. ఆదివారం లక్డీకపూల్‌లోని తేజ్ ఎక్‌క్లేవ్ అపార్ట్‌మెంట్‌లో విలేకరులతో మాట్లాడుతూ.. చారిత్రక సినిమా పేరుతో వినోదపు పన్ను మినహాయింపు పొందడం సమంజసం కాదన్నారు. ఈ చిత్రం టైటిలే తప్పుగా ఉందని వారు పేర్కొన్నారు. విశ్వనాథ సత్యనారాయణ రచించిన ‘ఆంధ్ర ప్రశస్తి’ పద్యరూపకంలో గోతమి పుత్ర శాతకర్ణిని వర్ణించారన్నారు. తెలంగాణ ప్రభుత్వం వద్ద రాయితీలు పొందేందుకు గౌతమి పుత్రుడు కోటిలింగాల్లో జన్మించినట్లుగా చూపడం అవాస్తవమన్నారు.
గౌతమి పుత్ర శాతకర్ణి విజయాలపై అతని తల్లి బాలశ్రీ వేయించిన నాసిక్ శిల శాసనంలోనూ ఆయన అమరావతి కేంద్రంగా భారత్‌ను పాలించినట్లుగా పేర్కొన లేదన్నారు. పశ్చిమ దక్షిణ భారతదేశాన్ని మాత్రమే ఆయన పాలించారని వారు వివరించారు. విశ్వనాథ సత్యనారాయణ రచించిన ఆంధ్ర ప్రశస్తి పుస్తకం ఆధారంగా ఈ చిత్రాన్ని నిర్మించినట్లు చెప్పడంలో నిజం లేదని ఈ సినిమా కేవలం కల్పితమని, రాయితీల కోసం చారిత్రక చిత్రంగా ప్రచారం చేసుకుంటున్నారన్నారు. గ్రీక్, ఇంగ్లీషు చిత్రాలను కాపీ కొట్టారన్నారు.