‘తుమ్మిడిహెట్టి’ ఎత్తిపోతలే | Gravity scheme, it is not | Sakshi
Sakshi News home page

‘తుమ్మిడిహెట్టి’ ఎత్తిపోతలే

Published Sun, Mar 13 2016 5:06 AM | Last Updated on Sun, Sep 3 2017 7:35 PM

‘తుమ్మిడిహెట్టి’ ఎత్తిపోతలే

‘తుమ్మిడిహెట్టి’ ఎత్తిపోతలే

అది గ్రావిటీ పథకం కాదు
♦ ప్రాణహిత డిజైన్ మార్పుపై ప్రభుత్వ సలహాదారు వివరణ
♦ ప్రాజెక్టుకు ఇంకా చాలా అనుమతులు రాలేదు
♦ ప్రాణహిత, ఇంద్రావతి నీటితో ఎస్సారెస్పీ, నిజాంసాగర్, సింగూరు ఆయకట్టు స్థిరీకరణ
 
 సాక్షి, హైదరాబాద్: ప్రాణహిత-చేవెళ్ల పాత డిజైన్ మేరకు ఆదిలాబాద్ జిల్లా కౌటాల వద్ద నిర్మించనున్న తుమ్మిడిహెట్టి బ్యారేజీ గ్రావిటీ పథకం కాదని ఎత్తిపోతల పథకమని రాష్ట్ర ప్రభుత్వ జలవనరుల విభాగం సలహాదారు ఆర్.విద్యాసాగర్‌రావు శనివారం వివరణ ఇచ్చారు.
 గోదావరి బేసిన్‌లోని ప్రధాన ప్రాజెక్టులు ఒకవేళ ఎండిపోతే ఉప నదులైన ప్రాణహిత, ఇంద్రావతి మాత్రమే తెలంగాణ ప్రాంతాన్ని రక్షించగలవని, ఈ నీటిని వినియోగంలోకి తెచ్చే ఉద్దేశంతోనే ప్రాజెక్టు రీడిజైన్ జరుగుతోందని పేర్కొన్నారు. బ్యారేజీలపై మహారాష్ట్రతో కుదిరిన ఒప్పందంతోపాటు ప్రభుత్వం తుమ్మిడిహెట్టి ఎత్తును 152 మీటర్ల నుంచి 148 మీటర్లకు తగ్గించేందుకు అంగీకరించడం, ప్రత్యామ్నాయంగా మేడిగడ్డ బ్యారేజీని 103 మీటర్ల ఎత్తులో నిర్మించాలన్న ప్రతిపాదనపై వ్యక్తమవుతున్న విమర్శలపై విద్యాసాగర్‌రావు ఈ మేరకు వివరణ ఇస్తూ ప్రకటన విడుదల చేశారు. అందులోని ముఖ్యాంశాలు...

 గోదావరిపై ఎగువ రాష్ట్రం అక్రమంగా చేపట్టిన వందలాది కట్టడాల వల్ల ఎస్సారెస్పీ, నిజాంసాగర్, సింగూరు ప్రాజెక్టుకు నీరు రాక ఆట స్థలాలుగా మారాయి. భవిష్యత్తులో ఉధృతంగా వరదలు వస్తే తప్ప ఈ ప్రాజెక్టుల్లో నీరు కనబడే అవకాశాలు తక్కువగా ఉన్నాయి.

 ఈ పరిస్థితుల్లో ప్రాణహిత, ఇంద్రావతి ఉపనదులు మాత్రమే తెలంగాణను రక్షించగలవు. ఈ ఉప నదుల్లో 75 శాతం డిపెండబులిటీ ప్రకారం 700 టీఎంసీల నీటి లభ్యత ఉంటుంది. ఈ నీటిని గోదావరి బేసిన్ ప్రాజెక్టులకు, అదనంగా పాత ప్రాజెక్టుల స్థిరీకరణకు మళ్లించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలోనే తుమ్మిడిహెట్టి ద్వారా ఆదిలాబాద్‌లో ఉపయోగించుకునే 20 టీఎంసీలు పోనూ మిగిలిన 140 టీఎంసీలను మేడిగడ్డ, ఇంద్రావతి ద్వారా నీటిని లిఫ్ట్ చేసి తుపాకులగూడెం బ్యారేజీ ద్వారా ఉపయోగించుకునేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.

 తుమ్మిడిహెట్టి ద్వారా ఆదిలాబాద్‌లో 2 లక్షల ఎకరాలు, మిగిలిన 14.40 లక్షల ఎకరాలకు మేడిగడ్డ ద్వారా ఎల్లంపల్లి నీటిని తరలించి సాగునీరు ఇవ్వాలని సర్కారు నిర్ణయించింది. ఎస్సారెస్పీ, నిజాంసాగర్, సింగూరు ఆయకట్టు స్థిరీకరణ కోసం ఇంద్రావతి నీటిని తుపాకులగూడెం ద్వారా లిఫ్టు చేసి మేడిగడ్డ ద్వారా వినియోగించుకోనున్నాం. అలాగే ఎస్సారెస్పీ ఫేజ్-2 ఆయకట్టుకు సైతం ఇంద్రావతి నీటినే ఉపయోగించుకుంటాం.

 పాత ప్రాజెక్టు డిజైన్ మేరకు 7 జలాశయాల ద్వారా 14.7 టీఎంసీలను మాత్రమే నిల్వ చేసే అవకాశం ఉండగా తాజా డిజైన్‌తో 130 టీఎంసీల నిల్వ సామర్థ్యంగల రిజర్వాయర్లు ఏర్పాటవుతున్నాయి.

 విమర్శకులు అభిప్రాయపడుతున్నట్లుగా ప్రాణహిత ప్రాజెక్టుకు ఏవో కొన్ని తప్ప చాలా అనుమతులు రాలేదు. కేంద్ర జలవనరులశాఖకు సంబంధించి సాంకేతిక సలహా కమిటీ, కేంద్ర పర్యావరణ, అటవీ, గిరిజన వ్యవహారాలశాఖల నుంచి అనుమతులు రాలేదు.

 కాళేశ్వరం ప్రాజెక్టు వద్ద తొందరగా పూడిక చేరే ప్రమాదం ఉందన్నది వాస్తవం కాదు. వరదలతోపాటు గేట్ల నిర్వహణతో పూడిక దిగువకు చేరుతుంది.

 ఈ ప్రాజెక్టుల వల్ల ఏపీ రైతుల ప్రయోజనాలకు భంగం వాటిల్లదు. గోదావరి జలాల్లో ఆం ధ్రప్రదేశ్‌కు నికరంగా లభించిన 530 టీఎంసీల వాటాను సక్రమంగా బట్వాడా చేసే బాధ్యతను గోదావరి బోర్డు చూసుకుంటుంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement