గ్రేటర్ బడ్జెట్ రూ.5,600 కోట్లు
♦ గ్లోబల్‌సిటీ, రహదారులు,
♦ గృహ నిర్మాణాలకు పెద్దపీట
సాక్షి, హైదరాబాద్: ఏప్రిల్ నుంచి ప్రారంభం కానున్న కొత్త ఆర్థిక సంవత్సరానికి (2016-17) జీహెచ్‌ఎంసీ భారీ బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. జీహెచ్‌ఎంసీ చరిత్రలోనే ఇంతకుముందెన్నడూ లేని విధంగా రూ.5,600 కోట్లతో బడ్జెట్‌ను రూపొందించింది. గతనెలలోనే దీన్ని ప్రభుత్వానికి నివేదించినప్పటికీ.. ఇప్పటిదాకా వివరాలు వెల్లడి కాలేదు. స్టాండింగ్ కమిటీ లేకపోవడంతో జీహెచ్‌ఎంసీ స్పెషలాఫీసరే బడ్జెట్‌ను రూపొందించి, ఆమోదించి, ప్రభుత్వానికి నివేదించారు. ప్రభుత్వం లాంఛనంగా ఆమోదిస్తుంది. కొత్త పాలక మండలి ఏర్పాటు కావడంతో సమాచారం నిమిత్తం కొత్తగా కొలువు దీరే సభ ముందుంచనున్నారు.
అంతకుమించి మార్పులేమీ ఉండబోవని తెలుస్తోంది. రహదారులు, వరద కాలువలపై బడ్జెట్‌లో ప్రత్యేక శ్రద్ధ చూపారు. పేదలకు గృహ నిర్మాణం, శుద్ధ జలం, గ్రీన్ హైదరాబాద్ వంటి వాటికి కూడా ప్రాధాన్యతనిచ్చారు. కొత్త బడ్జెట్‌లో అత్యధికంగా ఎస్సార్‌డీపీ పనులకు రూ.1000 కోట్లు, రహదారులకు 860 కోట్లు చూపారు. రహదారుల నిర్వహణకు 110.73 కోట్లు, నాలాల నిర్వహణకు రూ.76.61 కోట్లు చూపారు. వరద కాలువలు, రహదారులు, ఫ్లై ఓవర్లకు కలిపి రూ.2,180 కోట్లు ఖర్చు చేయనున్నట్లు బడ్జెట్‌లో పేర్కొన్నారు. 2015-16 బడ్జెట్‌ను రూ.5,550 కోట్లకు ఆమోదించగా, రివైజ్డ్ బడ్జెట్‌లో దాన్ని రూ. 5091 కోట్లకు తగ్గించారు.