పాలకుడిని కాదు.. సేవకుడిని మాత్రమే..
అవినీతి రహిత జీహెచ్‌ఎంసీ నా లక్ష్యం
గ్రేటర్ మేయర్ బొంతు రామ్మోహన్
సిటీబ్యూరో: ‘ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన నల్లా నీరు, స్లమ్స్‌లేని నగరం, పేదలకు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు.. ఇలా చేయాల్సిన పనులెన్నో ఉన్నాయి. వాటి అమలు కోసం అందరినీ కలుపుకొని నావంతు ప్రయత్నం చేస్తాను. కేసీఆర్ చెప్పిందే చేస్తారు. చేసేదే చెబుతారు. ఆ నమ్మకంతోనే ప్రజలు ఈ అఖండ విజయాన్ని అందించారు. వారి నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి. అందుకు పాలకుడిగా కాకుండా సేవకుడిగా పనిచేస్తాను’.. ఇదీ గురువారం నూతన మేయర్‌గా ప్రమాణం చేసిన అనంతరం బొంతు రామ్మోహన్ చెప్పిన మాటలు. ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యానికి అనుగుణంగా జీహెచ్‌ఎంసీని అవినీతి రహితంగా తీర్చిదిద్దాలనేదే తన ధ్యేయమన్నారు. తనకు దక్కిన ఈ అపురూప అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటానని, ప్రజలకు సేవకుడిగా పనిచేస్తానే తప్ప పాలకుడిగా ఏనాడూ భావించనన్నారు. ప్రజలకు సేవ చేసేందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ తనకు ఈ అవకాశం ఇచ్చారన్నారు.
‘కేసీఆర్‌కు అన్నీ తెలుసు. ఎవరి సేవలు ఎక్కడ ఎప్పుడు అవసరమో తెలుసు. పధ్నాలుగేళ్లు తెలంగాణ ఉద్యమంలో పనిచేశాను. ప్రస్తుతం నా సేవలు ఇక్కడ అవసరమని భావించి ఈ అవకాశం ఇచ్చారు. ఇప్పుడు ఏమీ మాట్లాడలేనంత ఉద్వేగంలో ఉన్నాను’ అంటూ ఆయన వ్యాఖ్యానిం చారు. హైదరాబాద్ నగరం ఎంతో పెరిగినా ఆ స్థాయిలో సదుపాయాలు పెరగలేదని, అభివృద్ధి జరగలేదన్నారు. ‘కేసీఆర్ విజన్ ఉన్న నాయకుడు. విశ్వ నగరానికి బృహత్ ప్రణాళికలు రూపొందించారు. దాన్ని అమలు చేయడంలో నేనూ భాగస్వామినవుతా’ అని పేర్కొన్నారు.
ప్రస్తుత దుస్థితికి గత పాలకులే కారణం..
గత పాలకుల నిర్లక్ష్యం వల్లే హైదరాబాద్ అభివృద్ధి చెందలేదని మేయర్ రామ్మోహన్ విమర్శించారు. ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే, చేపట్టిన స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమాలతో నగర ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు.. కల్పించాల్సిన సదుపాయాలపై అవగాహన వచ్చిందన్నారు. రహదారులు, డ్రైనేజీ, నాలాలు, నీటి నిల్వ ప్రాంతాలు తదితర సమస్యలు పరిష్కరించాల్సి ఉందన్నారు. ప్రభుత్వ పనితీరు వల్లే గూగుల్ వంటి అంతర్జాతీయ సంస్థలెన్నో హైదరాబాద్ బాట పట్టాయని, తద్వారా ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు. ఐటీ మంత్రి కేటీఆర్‌కు కుడి భుజంగా నగర అభివృద్ధిలో తనవంతు కృషి చే స్తానన్నారు. వచ్చిన పదవితో బాధ్యత మరింత పెరిగిందని, 150 మంది కార్పొరేటర్ల సహకారంతో మరింత కష్టపడి, ఉద్యమస్ఫూర్తితో పాలనలో మెరుగైన ఫలితాలు సాధించేందుకు కృషి చేస్తాన ని మేయర్ తెలిపారు. ఏ నగరానికీ లేని మంచి వాతావరణం, సహజ వనరులు హైదరాబాద్‌కు ఉన్నాయని చెబుతూ, అందుకనుగుణంగా నగరాన్ని హైస్పీడ్‌తో అభివృద్ధి చేయాల్సి ఉందన్నారు.
అర్ధాంగిగా సహకరిస్తా: శ్రీదేవి
ఉద్యమ సమయంలో ఆయన (రామ్మోహన్) ఇంటివద్ద ఉన్నది తక్కువని, ఉద్యమంలో ఎక్కువ పనిచేశారని కొత్త మేయర్ రామ్మోహ న్ సతీమణి బొంతు శ్రీదేవి అన్నారు. జీహెచ్‌ఎంసీలో ఆమెను కలిసిన విలేకరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ప్రస్తుతం లభించిన అవకాశంతో ప్రజలకు మెరుగైన సదుపాయాలు కల్పించేందుకు ప్రజల తరపున వారి సమస్యలు ఆయన దృష్టికి తెస్తానన్నారు. ప్రచారంలో భాగంగా తిరిగినప్పుడు నగరంలో నీటి సమస్య తీవ్రంగా ఉన్నట్లు గుర్తించానన్నారు. మహిళలకు డ్వాక్రా రుణాలు వంటివి అందాలని, అనేక ప్రాంతాల్లో బస్ షెల్టర్లు లేవన్నారు. కార్పొరేట్ చదువులు చదవలేని వారికి ఉచిత విద్య కావాలంటూ.. ఇలా దృష్టికొచ్చిన సమస్యల్ని తెలియజేసి అర్ధాంగిగా తనవంతు సహకారం అందిస్తానన్నారు.