గ్రేటర్‌లో ఆహారం.. అపాయం
మహానగరంలో ప్రమాదఘంటికలు మోగిస్తున్న కల్తీ పదార్థాలు... అనారోగ్యం పాలవుతున్న సిటీజనులు
గ్రేటర్‌లో ఆహార నాణ్యత ప్రశ్నార్థకంగా మారింది. ‘కల్తీ’ వ్యాపారం కట్టలు తెంచుకుంటోంది. హోటళ్లలో కనీస శుభ్రత కూడా కానరావడం లేదు. హోటళ్లు, తినుబండారాల విక్రయశాలలు, సరుకుల దుకాణాలు.. అంతటా కల్తీ జరుగుతూనే ఉంది. నగర జనాభా సుమారు కోటికి చేరింది. రోజుకు సగటున 8 లక్షల మంది బయట ఆహారం తీసుకుంటున్నారు. వీరిలో కల్తీ ఆహారం, తదితర కారణాల వల్ల ఏటా 40 వేల మంది అనారోగ్యంతో ఆస్పత్రుల్లో చేరుతున్నారంటే నగరంలో పరిస్థితేంటో అర్థం చేసుకోవచ్చు.
కల్తీ జరుగుతోందిలా.. : నగరంలో ‘కల్తీ’ మాఫియా వేళ్లూనుకుంది. నూనెలు, పప్పులు, పండ్లు, మాంసం, స్వీట్లు, కూల్‌డ్రింక్స్.. తదితరాల్లో వాటిలో కలిసిపోయే ప్రమాదకర పదార్థాలను కలుపుతున్నారు. వీటిని తిన్నవారు అనారోగ్యం పాలవుతున్నారు.
కోటి జనాభాకు నలుగురే..
ప్రజారోగ్యం దృష్ట్యా హోటళ్లు, తినుబండారాలు, ఆహార ధాన్యాల విక్రయశాలలను నిర్ణీత వ్యవధుల్లో సంబంధిత అధికారులు తనిఖీలు చేయాలి. ఇందుకు నగర జనాభా నాలుగు లక్షలున్నప్పుడు నలుగురు ఫుడ్ ఇన్‌స్పెక్టర్లను నియమించారు. ప్రస్తుతం గ్రేటర్ జనాభా సుమారు కోటి. కానీ ఇప్పటికీ నలుగురే ఫుడ్ ఇన్‌స్పెక్టర్లున్నారు. 26 పోస్టులు వుంజూరైనా భర్తీ కాలేదు. దీంతో తనిఖీలు సక్రమంగా జరగడం లేదు.
చట్టం అమలేదీ..?
ఆహార పదార్థాల్లో కల్తీ నిరోధానికి ‘ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్’ చట్టం ఉన్నప్పటికీ అమలవుతున్న దాఖలాల్లేవు. దీని ప్రకారం..
► ప్రజలకు అందించే ఆహారం నాణ్యతగా ఉండాలి.
► ముడిసరుకు, నిల్వ ఉంచే ప్రదేశం, తయారీలో శుచి, పరిశుభ్రంగా వడ్డించడం వరకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
► ఎక్కువ కాలం నిల్వ ఉంచే పదార్థాలను నిర్ణీత ఉష్ణోగ్రతల్లో తగిన జాగ్రత్తలతో ఉంచాలి.
► ఆహారంలో కల్తీ కారణంగా ఎవరైనా మృతి చెందితే.. బాధిత కుటుంబానికి హోటల్ యజమాని రూ.5 లక్షలు చెల్లించాలి.
► అంతేకాదు.. అందుకు బాధ్యుడ్ని చేస్తూ హోటల్ యజమానికి ఆరునెలల జైలు శిక్ష విధించడంతో పాటు హోటల్ సీజ్ చేయాలి.
► లెసైన్సు లేకుండా ఆహార పదార్థాల ఉత్పత్తి, సరఫరా చేస్తే రూ.25 వేల జరిమానా.
తూతూమంత్రంగా తనిఖీలు...
ఆహార నాణ్యతపై జీహెచ్‌ఎంసీ అధికారుల పర్యవేక్షణ కొరవడింది. తూతూమంత్రంగా తనిఖీలు చేస్తూ చేతులు దులుపుకుంటున్నారు. ఐదేళ్లుగా అధికారులు ఆహార కల్తీలపై నమోదు చేసిన కేసుల సంఖ్యను చూస్తే వారి పనితీరు ఏ విధంగా ఉందో అంచనా వేయొచ్చు. 2014 జూన్- 2015 జులై వరకు నమోదైన కేసుల్లో 92 కోర్టుల్లో ఉన్నాయి. కల్తీ జరిగినట్లు నిర్ధరణ అయినప్పటికీ నామమాత్రపు జరిమానాలు మాత్రమే విధిస్తున్నారు. ఎవరికీ శిక్షలు పడకపోవడంతో ఈ తంతు కొనసాగుతూనే ఉంది.
చాలా ప్రమాదకరం..
కల్తీ ఆహారం తినడం వల్ల ప్రమాదకర వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. కల్తీ ఆహారంతో డయేరియా, వాంతులు సాధారణంగా కనిపిస్తాయి. పచ్చకామెర్లకు అవకాశం ఎక్కువ. ఏ, ఈ, వైరస్‌ల దాడి ఉంటుంది. వివిధ అవయవాల పనితీరుపై ప్రభావం చూపుతుంది. కొన్ని సందర్భాల్లో గుండె, మెదడు, కాలేయం వంటి పైనా ప్రభావం తప్పదు. జీర్ణవ్యవస్థ పైనా ఎఫెక్ట్ ఉంటుంది. వంటవాళ్లు, వడ్డించే వాళ్లు వ్యక్తిగత శుభ్రత పాటించకపోయినా తినేవారికి ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి.
- డాక్టర్ బి.రవిశంకర్, గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, సన్‌షైన్ హాస్పిటల్
నాణ్యత కరవు...
నేహ, ఎంటర్‌పెన్యూర్
నగరం విస్తరణతో పాటే రెస్టారెంట్లూ పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. పైకి హంగులు కనిపిస్తున్నా రెస్టారెంట్లలో నాణ్యత పాటించడం లేదనేది వాస్తవం. నిర్వాహకులు నాణ్యత విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. గతంలో ఓ రిసార్ట్‌కు వెళ్లాం. వెజ్ సూప్ ఆర్డర్ చేస్తే అందులో చికెన్ కనిపించింది. ఓ ప్రముఖ రెస్టారెంట్‌లో బిర్యానీ ఆర్డర్ చేస్తే అందులో బొద్దింక వచ్చింది. దీంతో రెస్టారెంట్లకు వెళ్లాలంటేనే భయమేస్తోంది. ఆహార నాణ్యత విషయంలో అన్ని నిబంధనలు అమలు చేసే వారినే ప్రజలు గెలిపించాలి.
కల్తీ.. కల్తీ.. అంతా కల్తీ..పాల నుంచి పండ్ల వరకు.. జామ్ నుంచి జెల్లీ వరకు.. నెయ్యి నుంచి నీళ్ల వరకు.. టిఫిన్ నుంచి డిన్నర్ వరకు... ఎక్కడ తిన్నా.. ఏది తిన్నా.. ఏ సమయంలో తిన్నా.. అంతా కల్తీ.. కల్తీ..
పాలకుల నిర్లక్ష్యం, అధికారుల అలసత్వంతో భాగ్యనగరిలో
‘కల్తీ’ వ్యాపారం పడగవిప్పుతోంది. ఆహారం విషమై సిటీజనుల
ఆరోగ్యాన్ని కబలిస్తోంది. పర్యవేక్షణ పట్టాలు తప్పి.. ప్రజలు పాట్లు
పడుతున్నారు. గ్రేటర్ ఎన్నికల వేళ ఆహార నాణ్యతకు
ప్రాధాన్యమిచ్చే పార్టీకే పట్టం కడతామంటున్నారు నగరవాసులు.
- సాక్షి, సిటీబ్యూరో,అంబర్‌పేట
చర్యలు శూన్యం..
శ్రీనివాస్‌నాయుడు, ముషీరాబాద్
నగరంలో అంతా కల్తీ అయిపోయింది. చివరికి ఆవాలు, మిర్యాలు కూడా కృత్రిమంగా తయారు చేస్తున్నారు. ఫుడ్ పాయిజాన్ జరిగి సిటీలో కలకలం రేపిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. అయినా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. హోటళ్లలో ప్రతి మూడు నెలలకోసారి తనిఖీలు చేయాలి. నాణ్యత ప్రమాణాలు పాటించేలా చర్యలు తీసుకోవాలి. ఈ దిశగా కృషి చేసే నాయకుడికే నా ఓటు.