రాష్ట్రమంతా ఆకుపచ్చని పండుగ | Green Festival from hyderabad to kodad | Sakshi
Sakshi News home page

రాష్ట్రమంతా ఆకుపచ్చని పండుగ

Published Tue, Jul 5 2016 2:13 AM | Last Updated on Mon, Sep 4 2017 4:07 AM

రాష్ట్రమంతా ఆకుపచ్చని పండుగ

రాష్ట్రమంతా ఆకుపచ్చని పండుగ

- జాతీయ రహదారులకు ఇరువైపులా హరితహారం
-  8న హైదరాబాద్-కోదాడ వరకు మొక్కలు నాటే ఉత్సవం
- 165 కిలోమీటర్ల పొడవునా 85 వేల మంది భాగస్వామ్యం
- నల్లగొండ జిల్లాలో హరితహారాన్ని ప్రారంభించనున్న సీఎం

 
సాక్షి, హైదరాబాద్: హరితహారం కార్యక్రమాన్ని రాష్ట్రమంతటా పండుగలా నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. తెలంగాణలోని అన్ని జాతీయ రహదారులకు ఇరువైపులా మొక్కలు పెంచాలని నిర్ణయించింది. ఈ మహోద్యమంలో ప్రజలందరూ కలసి వచ్చేలా కార్యాచరణను రూపొందించింది. ఇందులో భాగంగా హరితహారం కార్యక్రమాన్ని ఈ నెల 8న నల్లగొండ జిల్లాలోని చిట్యాల మండలం పెద కాపర్తి వద్ద ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రారంభించనున్నారు. అదే రోజు అన్ని జిల్లాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, అధికారులు తమ జిల్లాలు, శాఖల పరిధిలో ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు.
 
  ప్రధానంగా హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్లే జాతీయ రహదారిపై తెలంగాణ సరిహద్దు వరకు 165 కిలోమీటర్ల మేర రోడ్డుకు ఇరువైపులా పూల చెట్లు, నీడనిచ్చే చెట్లు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించడంతో ఈ రహదారి పొడవునా ఒకేసారి 85 వేల మంది హరితహారంలో భాగస్వాములు కానున్నారు. హైదరాబాద్ శివార్లలోని రామోజీ ఫిల్మ్ సిటీ దగ్గరున్న అబ్దుల్లాపూర్‌మెట్ నుంచి నల్లగొండ జిల్లా కోదాడ మండలం నల్లబండగూడెం వరకు మొక్కలు నాటనున్నారు. స్వయం సహాయక బృందాల సభ్యులు, విద్యార్థులు, అధికారులు, ప్రజాప్రతినిధులందరూ తరలివచ్చేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తం రహదారిని 14 సెగ్మెంట్లుగా విభజించారు. ఒక్కో సెగ్మెంట్‌కు ఒక్కో అధికారిని ఇన్‌చార్జిగా నియమించారు.
 
హరితహారం ఓఎస్‌డీ ప్రియాంక వర్గీస్ ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నారు. హైదరాబాద్ నుంచి రాష్ట్ర సరిహద్దుల వరకు ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలు, పది మండలాలు, 50 గ్రామాలున్నాయి. ఆయా గ్రామాలకు చెందిన ప్రజలు స్వచ్ఛందంగా తరలి రావాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. 14 సెగ్మెంట్లలో మొక్కల పంపిణీకి ప్రత్యేక కౌంటర్లు కూడా ఏర్పాటు చేస్తున్నారు. మొక్కలు నాటడమే కాకుండా వాటిని సంరక్షించేలా చర్యలు తీసుకోనున్నారు. ఒకే రకం పూల చెట్లు కాకుండా పది కిలోమీటర్లకు ఒర రకం, ఒక రంగు చొప్పున చెట్లను పెంచనున్నారు. తెలంగాణ నుంచి వెళ్లే అన్ని జాతీయ రహదారులకు ఇరువైపులా ఇలాగే మొక్కలు నాటాలని ప్రభుత్వం నిర్ణయించింది. హైదరాబాద్‌లో బయల్దేరిన ప్రయాణికులు తెలంగాణ సరిహద్దు దాటే వరకు అందమైన, ఆహ్లాదకరమైన వాతావరణంలో చల్లని గాలుల మధ్య ప్రయాణం సాగించేలా పూలచెట్ల పెంపకం జరగనుంది.
 
 ఔషధ మొక్కల పంపిణీకి ఏర్పాట్లు
 పండ్లు, పూల మొక్కలతోపాటు ఔషధ మొక్కలనూ భారీ స్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉంచాలన్న ముఖ్యమంత్రి ఆదేశం మేరకు అటవీశాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 11న హైదరాబాద్‌లోని కేబీఆర్ పార్కు, నెక్లెస్ రోడ్డు, పీపుల్స్ ప్లాజా, హైటెక్ సిటీ, చార్మినార్, ఉప్పల్, శంషాబాద్ ఎయిర్‌పోర్టు ప్రాంతాల్లో ప్రత్యేక కౌంటర్లు పెట్టి ఔషధ మొక్కలు నాటడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement