సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రాంతంలో కరెంటు కోతలతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నందున.. వెంటనే ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతికి టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు విజ్ఞప్తి చేశారు. ఆయన శుక్రవారం సాయంత్రం మహంతితో భేటీ అయ్యారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. తెలంగాణలో కరెంటు కోతలు తీవ్రంగా ఉండడంతో పంటలకు సరిగా నీళ్లందక వ్యవసాయం దెబ్బతినే పరిస్థితి ఎదురైందన్నారు. గురువారం కొన్ని ప్రాంతాల్లో గంటసేపు మాత్రమే కరెంటు సరఫరా ఉండటం పరిస్థితికి అద్దం పడుతోందన్నారు. ఈ సమస్యతోపాటు తన నియోజకవర్గానికి సంబంధించిన అంశాలపైనా సీఎస్‌తో మాట్లాడానన్నారు.
కాంగ్రెస్‌లో టీఆర్‌ఎస్ విలీనం కావద్దనే కోరుకుందాం..
ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీలో టీఆర్‌ఎస్ విలీనమవుతోందా? లేదా? అని విలేకరులు ప్రశ్నించగా.. హరీశ్‌రావు నేరుగా జవాబు చెప్పలేదు. మీరేం కోరుకుంటున్నారంటూ ఎదురు ప్రశ్నించారు. ‘విలీనం కావద్దనే కోరుకుంటున్నాను’ అని ఓ విలేకరి అనగా.. అదే జరగొచ్చని, విలీనం కావద్దనే కోరుకుందామంటూ అక్కడినుంచి వెళ్లిపోయారు.
తెలంగాణలో కరెంటు వెతలు తీర్చండి
Published Sat, Mar 1 2014 12:14 AM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM
Advertisement
Advertisement