నైతిక విలువలు నాడేమయ్యాయి: హరీశ్‌రావు
* టీడీపీ, కాంగ్రెస్‌లపై మంత్రి ధ్వజం
* ఫిరాయింపులను ప్రోత్సహించిన చరిత్ర వారిదే
* సభను అడ్డుకుంటే సస్పెండ్ చేస్తాం
సాక్షి, హైదరాబాద్: గతంలో ఫిరాయింపులను ప్రోత్సహించిన టీడీపీ, కాంగ్రెస్‌లు ఇప్పు డు గురువిందగింజ తన నలుపెరగని చందంగా వ్యవహరిస్తున్నాయని శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి హరీశ్‌రావు ధ్వజమెత్తారు. శనివా రం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కాంగ్రెస్,టీడీపీ నేతల ద్వంద్వ వైఖరిని దుయ్యబట్టారు. ఇతర పార్టీ ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు టీఆర్‌ఎస్ గాలం వేసి తనలో చేర్చుకుంటోందని, ఇది అనైతికమంటూ వ్యాఖ్యానించే నైతిక అర్హత కాంగ్రెస్, టీడీపీ నేతలకు లేదన్నారు. కాంగ్రెస్ నేత జానారెడ్డి సైతం టీడీపీ నుంచి కాంగ్రెస్‌లోకి ఫిరాయించిన వారే. ఇందిర హయాంలో టీడీపీని చీల్చి నాదెండ్ల భాస్కర్‌రావును ముఖ్యమంత్రిగా చేశారు.
అణుఒప్పందం సమయంలో మన్మోహన్ ప్రభుత్వం ఇతర పార్టీల ఎంపీలను కొనుగోలు చేసింది. ఎన్నికలకు ముందు టీఆర్‌ఎస్‌కు చెందిన విజయశాంతి, అరవింద్‌రెడ్డిలను కాంగ్రెస్‌లో చేర్చుకున్నారు. వైఎస్ హయాంలో సైతం పదిమంది ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకున్నారు. ఆనాడు ఇది తప్పనిపించలేదా?’ అని హరీశ్ సూటిగా ప్రశ్నించారు. తమ పార్టీలోకి ఇతర నేతలు రావడం ఈరోజే కొత్త కాదని, ఉద్యమ సమయంలో సైతం కేకే, జూపల్లి కృష్ణారావు, రాజయ్య, మందా జగన్నాథం వంటి నేతలు టీఆర్‌ఎస్‌లో చేరారని హరీశ్ గుర్తు చేశా రు. ఇక టీ టీడీపీ నేతల వ్యాఖ్యలపై స్పందిస్తూ, ‘తెలుగుదేశం నెలకొల్పినప్పుడు చంద్రబాబు ఏ పార్టీలో ఉన్నారు.
ఆయన కాంగ్రెస్ నుంచి ఫిరాయించినవారే కదా’ అని అన్నారు. ఆత్మహత్యలపై టీడీపీ నేతలు మొసలికన్నీరు కారుస్తున్నారని ఆయన అన్నారు. ‘కార్గిల్ యుద్ధ సమయంలో దేశంలోని పార్టీలన్నీ ఒక్కటై పోరాడాయని, అలాగే, కావేరీ జలాల విషయంలో తమిళనాడులోని పార్టీలన్నీ ఏకమై పోరాడాయి. కానీ ప్రస్తుతం రాష్ట్రానికి న్యాయంగా ఇవ్వాల్సిన కరెంట్ ఇవ్వని చంద్రబాబును తెలంగాణ టీడీపీ నేతలు మాత్రం వెనకేసుకొస్తున్నారని ఆరోపిం చారు.
‘రాష్ట్రం తరఫున మాట్లాడాల్సింది పోయి బాబుకు వంతపాడుతున్నారు’ అని విమర్శిం చారు. అసెంబ్లీలో వ్యవసాయ, విద్యుత్ సహా అన్ని అంశాలపై తాము సిద్ధంగా ఉన్నప్పటికీ, సభ జరిగితే బాబు బండారం బయటపడుతుం దనే భయంతో టీడీపీ ఎమ్మెల్యేలు సభకు అడ్డుతగిలారని తెలిపారు. సోమవారం ఈ అంశాలపై చర్చించేందుకు తాము సిద్ధమని, సభను అడ్డుకుంటే టీడీపీ సభ్యులను సస్పెండ్ చేసైనా చర్చ చేపడతామని హరీశ్ స్పష్టం చేశారు.