రోహిత్ ఆత్మహత్య; దత్తాత్రేయపై కేసు నమోదు
హైదరాబాద్ : హెచ్సీయూ విద్యార్థి రోహిత్ ఆత్మహత్య వ్యవహారంలో కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయపై కేసు నమోదు అయింది. దత్తాత్రేయ ఇచ్చిన లేఖ వల్లే రోహిత్ ఆత్మహత్య చేసుకున్నాడని విద్యార్థులు సోమవారం గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అలాగే వైస్ ఛాన్సులర్ అప్పారావుపై కూడా కేసు నమోదు అయింది. ఏ1 వీసీ అప్పారావు, ఏ2 బండారు దత్తాత్రేయ, ఏ3 సుశీల్ కుమార్, ఏ4 విష్ణుపై సెక్షన్ 306 కింద కేసు నమోదు చేశారు.
మరోవైపు యూనివర్సిటీ అధ్యాపకుల సంఘం కూడా ...రోహిత్ ఘటనపై ఎలాంటి కమిటీ వేయకుండా చర్యలు తీసుకున్నారని, అందువల్లే అతడు ఆత్మహత్య చేసుకున్నాడని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. కాగా హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం (హెచ్‌సీయూ) స్కాలర్ రోహిత్ ఆత్మహత్యకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు ఆందోళన చేపట్టారు. దీంతో పోలీసు బలగాల మోహరింపు, విద్యార్థుల ఆందోళనతో హెచ్సీయూలో ఉద్రిక్తత నెలకొంది.