
కాసుల పంట
రేటర్ హైదరాబాద్ ఆదాయం ఒక్కసారిగా పెరిగింది.
- రికార్డు స్థాయిలో ఆస్తి పన్ను వసూలు
- ఖజానాకు చేరిన అదనపు ఆదాయం
- గత ఏడాది వసూలైంది రూ.93 కోట్లు
- ఈసారి వచ్చింది రూ.261 కోట్లు అదనంగా సమకూరింది రూ.168 కోట్లు
- ఆనందంలో అధికారులు మరింత ఉత్సాహంగా
- పనిచేయాలని కమిషనర్ సూచన
సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్ హైదరాబాద్ ఆదాయం ఒక్కసారిగా పెరిగింది. పైసా పెంచకపోయినా కాసులు కురిసాయి. ఒక్క ఆస్తి పన్ను రూపేణా రూ.168 కోట్ల ఆదాయం అదనంగా సమకూరింది. ఈ పరిణామంతో జీహెచ్‌ఎంసీ అధికారులు తబ్బిబ్బవుతున్నారు. ఇంకాస్త చొరవ తీసుకుని ఉంటే మరింత మొత్తం వసూలయ్యేదని అధికారులు భావిస్తున్నారు. ఇదే స్ఫూర్తిని ప్రదర్శించి ఆదాయాన్ని మరింత పెంచుకోవాలని యోచిస్తున్నారు. జీహెచ్‌ఎంసీకి గత ఆర్థిక సంవత్సరం కంటే ఈసారి ఆస్తిపన్ను రూపేణా రూ.168 కోట్లు అదనంగా వసూలైంది. సోమవారం (జూన్ 30) ఒక్కరోజే 42 వేల మంది రూ.62 కోట్లు ఆస్తిపన్నుగా చెల్లించారు.
మొదటి విడత పన్ను చెల్లిం చేందుకు జరిమానా లేకుండా జూన్ 30 వరకు అధికారులు గడువు ఇవ్వడంతోపాటు ఆదివారం(జూన్ 29) సైతం పౌరసేవా కేంద్రాలను తెరిచి ఉంచడంతో ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. దీంతో జీహెచ్‌ఎంసీకి రావాల్సిన ఆదాయం ఈ ఆర్థిక సంవత్సరం తొలి మూడు నెలల్లో గణనీయంగా పెరిగింది. ప్రజలు తమ ఆస్తిపన్నును రెండు విడతల్లో చెల్లించే అవకాశం ఉంది. తొలివిడత పన్నును జూన్ నెలాఖరులోగా, రెండో విడతగా డిసెంబర్ నెలాఖరులోగా చెల్లిస్తే ఎలాంటి జరిమానా ఉండదు. గడచిన సంవత్సరాల తో పోలిస్తే పెనాల్టీ లేకుండా ఆస్తిపన్ను చెల్లించేందుకు ప్రజలు మొగ్గు చూపారు.
జీహెచ్‌ఎంసీలో దాదాపు 13 లక్షల మంది ఆస్తిపన్ను చెల్లింపుదారులుండగా, వీరిలో 4 లక్షల మంది పన్ను చెల్లించారు. మరోవైపు బకాయిదారులతో అధికారులు జరిపిన సంప్రదింపులు, తీసుకున్న చర్యలు సైతం మంచి ఫలితానిచ్చింది. గత ఏడాది జూన్ నెలాఖరు వరకు కేవలం రూ.93 కోట్లు వసూలు కాగా, ఈ ఏడాది రూ.261 కోట్లకు పెరిగింది. పన్ను విషయమై అవగాహన కల్పించడం వల్లే మెరుగైన ఫలితాలు ఇచ్చినట్టు జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్ తెలిపారు.
ఆగస్టు 31 వరకు గడువు పెంపు..
జరిమానా లేకుండా ఆస్తిపన్ను చెల్లించేందుకు జూన్ నెలాఖరు వరకున్న గడువును ఆగస్టు 31 వరకు పొడిగించారు. ఆర్థిక సంవత్సరం ప్రారంభమైనప్పటి నుంచి అధికారులు, సిబ్బంది ఎన్నికల విధుల్లో నిమగ్నమై ఉన్నందున తగిన ప్రచారం నిర్వహించలేకపోయామని జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్ ప్రభుత్వానికి తెలిపారు. ఈ నేపథ్యంలో ఆస్తిపన్ను చెల్లింపు గడువును పొడిగించాల్సిందిగా కోరారు. అందుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు సుముఖత వ్యక్తం చేయడంతో గడువును ఆగస్టు 31 వరకు పెంచినట్టు కమిషనర్ మంగళవారం రాత్రి విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు.