
అనురాగం అనుబంధం
అన్నా చెల్లెళ్లు..అక్కా తమ్ముళ్ల అనుబంధానికి ప్రతీక రక్షా బంధన్. రాఖీ కట్టి...తీపి తినిపించి ఆనందపడుతుంది సోదరి. బహుమతి ఇచ్చి ఆశీస్సులు పొంది ఉప్పొంగిపోతాడు సోదరుడు. రాఖీ వేళ.. ఈ అనురాగాల పండుగ గురించి పలువురు సెలబ్రిటీలు చెప్పిన ముచ్చట్లు...
కనిపెంచే వారు తల్లిదండ్రులైతే.. కనిపెట్టుకుని కాచుకునే వారు అన్నదమ్ములు. నీ పాదం మీద పుట్టుమచ్చనై తోడబుట్టిన రుణం తీర్చుకుంటాననే సోదరుడి హామీ ప్రతి సోదరికీ కొండంత కానుక. అనుక్షణం అండదండగా నిలిచే అన్నా/తమ్ముడికి ఏ ఆపదా రాకూడదని తన ప్రేమాభిమానాలు రక్షగా.. అతడు అన్నింటా అజేయుడై నిలవాలని అక్కాచెల్లెళ్లు ఆకాంక్షిస్తారు. మణికట్టు మీద మెరుస్తారు. నేడు ‘రక్షాబంధన్’ సందర్భంగా పలువురు ప్రముఖులు అన్నాచెల్లెళ్ల అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ‘రాజువై గెలవరా.. రక్ష నేనే సోదరా’ అంటూ దీవించారు. – సాక్షి, సిటీబ్యూరో
లక్కీ బ్రదర్
రాఖీ పండుగ అంటే ఫుల్ సందడి. చిన్నప్పుడు మా అమ్మ నాకు, తమ్ముడు అమన్‌కి ఇష్టమైన లడ్డూలు, కేకులు, జిలేబీలు చేసేది. రాఖీ సందర్భంగా ఇంట్లో ఉన్న టాయ్స్ అన్నీ ఓ చోట పెట్టి బెలూన్స్‌తో అలంకరించేది. నేనేమో ‘అమ్మా.. స్వీట్స్ తినొచ్చా’ అంటే.. ‘ముందు రాఖీ కట్టు. ఆ తర్వాతే’ అనేది. స్వీట్స్ తినడం కోసం అమన్‌కి త్వరగా రాఖీ కట్టేదాన్ని. అప్పుడు రాఖీ విలువ తెలియదు. పెద్దయ్యాక తెలిసింది. ఓ బ్రదర్ ఉండటం లక్. నా విషయంలో అమన్ చాలా కేరింగ్‌గా ఉంటాడు.
కానీ, తను మాత్రం కేర్‌లెస్‌గా ఉంటాడు. వస్తువులు జాగ్రత్తగా ఉంచుకోడు. చిన్నప్పుడు ఈ విషయంలో చాలా గొడవపడేవాళ్లం. ఇప్పుడు మాత్రం మా మధ్య చిన్న చిన్న గొడవలు కూడా లేవు. మేమిద్దరం అక్కాతమ్ముడు అనేకన్నా మంచి ఫ్రెండ్స్ అని చెప్పుకోవాలి. ఏ విషయాన్నయినా ఓపెన్‌గా మాట్లాడుకుంటాం. అమన్‌కి ఆర్టిస్ట్ అవ్వాలని ఉంది. ఒక సినిమా కూడా స్టార్ట్ అయింది. ‘ఐయామ్ హ్యాపీ ఫర్ హిమ్’. నేను సక్సెస్ అయినట్లే కచ్చితంగా తనూ సక్సెస్ అవుతాడు. మా తమ్ముడి మీద నాకంత నమ్మకం ఉంది. – రకుల్ ప్రీత్‌సింగ్
ఆనందాల వేడుక
జీవితంలో అన్నా చెల్లెళ్ల అనుబంధం చాలా గొప్పది. మనకు ఎప్పుడూ తోడుండేది వారే. నా జీవితాన్ని బ్రదర్స్ లేకుండా ఊహించుకోలేను. కష్టమొచ్చినా, సుఖమొచ్చినా వారితో పంచుకుంటా. వారిద్దరికీ నేనంటే చాలా ఇష్టం. అన్ని విధాలుగా భరోసానిస్తుంటారు. బ్రదర్స్ ఉండటం ఓ వరం. ప్రతి ఏటా ఆనందోత్సాహాల మధ్య రాఖీ పండుగ జరుపుకుంటాం. ఈ ఏడాది రాఖీ పండుగకు ప్రత్యేక బహుమతులు సిద్ధం చేశా. – మంచు లక్ష్మి
అక్కే నాకు పెద్ద అభిమాని..
ప్రపూర్ణక్క. నాకంటే మూడేళ్ల పెద్దది. చాలా ఫ్రెండ్లీ. నేను పదోతరగతిలో ఉన్నప్పుడు అక్క స్టడీస్ కోసం పూణేకు వెళ్లింది. స్టడీస్ ముగిశాక పెళ్లి చేసుకుని విదేశాలకు వెళ్లింది. అలా దూరం అయ్యాక నాకు బాండింగ్ ఎక్కువైంది. నా ప్రతి షో మిస్ కాకుండా చూస్తుంది. సలహాలు సూచనలు అందిస్తుంది. నా బిగ్గెస్ట్ ఫ్యాన్ అక్కే. తను అమెరికాలో ఓ సక్సెస్‌ఫుల్ బిజినెస్ ఉమెన్. రాఖీ పండుగ రోజు తను ఎక్కడున్నా కొరియర్‌లో రాఖీ పంపిస్తుంది. ఈ ఏడాది స్వయంగా రాఖీ కడుతుందని అనుకున్నా. బిజినెస్ పని ఉండడంతో నిన్ననే అమెరికాకు వెళ్లింది. – ప్రదీప్, యాంకర్
పేరు ప్రఖ్యాతుల కంటే పేగుబంధం గొప్పది..
రాఖీ పండుగొస్తే తోబుట్టువులతో నా ఇల్లు కళకళలాడుతుంది. నా అక్కలు లలిత, శకుంతల నా చెల్లి ఇంద్రాణి అనురాగానికి ప్రతీకలు. ఉదయమే వచ్చి రాఖీకట్టి నన్నుఆశీర్వదిస్తారు. వారి ఆశీర్వాదాలే నాకు శ్రీరామరక్ష. కొండంత అండ. నా ముద్దుల చెల్లి మహేశ్వరి మమ్మల్ని విడిచివెళ్లడం విషాదకరం. ఆ రోజు కచ్చితంగా అందరం ఆమెను తలచుకుంటాం. జీవితంలో ఎంత ఎత్తుకు ఎదిగినా.. ఎంత పేరు గడించినా పేగుబంధమే గొప్పదని నమ్మే మనిషిని నేను.
– టి. పద్మారావు, రాష్ట్ర ఎక్సైజ్‌శాఖ మంత్రి
రాఖీ పండుగ రోజు తెల్లవారుజామునే తూఫ్రాన్ నుంచి బయల్దేరతా. సూర్యోదయం నాటికి అన్న ఇంటికి వస్తా. రాఖీ కట్టి అన్నని ఆశీర్వదిస్తా. ప్రతి ఏటా ఇలానే చేస్తా.
– శకుంతల, మంత్రి పద్మారావు అక్క
ఆత్మీయులే నా సోదరులు
రాఖీ పండుగ వస్తే నాకు మహానందం. నాకు సోదరులు లేరు. అందుకే నా చుట్టూ ఉండే వారికి రాఖీలు కట్టి ఆనందం పంచుకుంటా. బంధువుల పిల్లలకు రాఖీ కట్టి బహుమతులు అందజేస్తా. రాఖీ పండుగ రోజు నా చెల్లితో ప్రత్యేకంగా గడుపుతా. సృష్టిలో సోదరబంధం చాలా గొప్పది. – మధుప్రియ, గాయని
ఫ్రెండ్లీ బ్రదర్
నా దృష్టిలో రాఖీపౌర్ణమికి ప్రత్యేక స్థానం ఉంది. నా సోదరుడు రౌనాక్ మర్చెంట్ నేవీలో పనిచేస్తున్నాడు. అతను మాకు అందుబాటులో ఉండేవాడు కాదు. గతేడాది రాఖీపౌర్ణమికి రౌనాక్ నేరుగా నా వద్దకు రావడంతో ఆశ్చర్యానికి గురయ్యా. ఆనందంగా రాఖీ కట్టా. ఈ ఏడాది మాత్రం కొరియర్‌లో రాఖీ పంపించా. వెరీ ఫ్రెండ్లీ బ్రదర్. సోదర ప్రేమ అద్భుతం, అమోఘం, అనిర్వచనీయం. – రాశీఖన్నా, హీరోయిన్