కోర్టులంటే జోక్ అయిపోయింది!
హోంశాఖ ముఖ్య కార్యదర్శిపై హైకోర్టు మండిపాటు
సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా కోర్టులో అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ల (ఏపీపీ) నియామకం విషయంలో హోంశాఖ ముఖ్య కార్యదర్శి కౌంటర్ దాఖలు చేయకపోవడం పట్ల ఉమ్మడి హైకోర్టు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. కోర్టులంటే అధికారులకు జోక్ అయిపోయిందంటూ మండిపడింది. వచ్చే వారానికల్లా కౌంటర్ దాఖలు చేయాలని, లేనిపక్షంలో హోంశాఖ ముఖ్య కార్యదర్శి స్వయంగా కోర్టు ముందు హాజరు కావాలని హైకోర్టు తేల్చి చెప్పింది.
అంతేకాక అదనపు పీపీల నియామకానికి సంబంధించిన అన్ని రికార్డులను కూడా తమ ముందుంచాలంది. తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ జె.ఉమాదేవిలతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. రంగారెడ్డి జిల్లా కోర్టులో అదనపు పీపీల నియామకం నిబంధనలకు విరుద్ధంగా జరుగుతోందంటూ హైకోర్టులో మూడు వ్యాజ్యాలు దాఖలైన విషయం తెలిసిందే.