పార్కులుగా మార్చడం సరైనదే..
ప్రభుత్వ స్థలాలపై హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: రాజధానిలోని ఖాళీ ప్రభుత్వ స్థలాలను పార్కులుగా మార్చడం సరైనదేనని, ఎన్ని వీలుంటే అన్ని పార్కులు ఏర్పాటు చేయడం వల్ల లాభాలే ఎక్కువని హైకోర్టు అభిప్రాయపడింది. ప్రభుత్వ స్థలాలు ఖాళీగా ఉంటే ఆక్రమణలకు గురవుతాయని, వాటిని పార్కులుగా మార్చితే తప్పేంటని పిటిషనర్‌ను ప్రశ్నించింది. సనత్‌నగర్ భరత్‌నగర్‌కాలనీలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ స్థలాన్ని పార్కుగా మార్చడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని మంగళవారం హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ జె.ఉమాదేవితో కూడిన ధర్మాసనం విచారించింది.
ఆ స్థలాన్ని క్రీడా మైదానంగా చేసుకుని పిల్లలు ఆడుకుంటున్నారని, ఇప్పుడు ఆ స్థలాన్ని పార్కుగా మార్చేందుకు అధికారులు చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకోవాలని పిటిషనర్ పేర్కొన్నారు. ప్రభుత్వ ఖాళీ స్థలాల్ని పార్కుగా మార్చడంపై ప్రభుత్వం నిర్ణయిస్తుందని, ఇలాంటి అంశాలపై న్యాయస్థానాలు జోక్యం చేసుకోబోవని స్పష్టం చేసింది.