
ధిక్కార కేసులో రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌కు జైలు శిక్ష
కోర్టు ధిక్కార కేసులో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఎం రఘునందనరావుకు హైకోర్టు బుధవారం నాలుగు వారాల జైలు శిక్ష, రూ. 2వేల జరిమానా విధించింది.
ఏజీ అభ్యర్థన తో తీర్పు అమలు వాయిదా
సాక్షి, హైదరాబాద్ : కోర్టు ధిక్కార కేసులో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఎం రఘునందనరావుకు హైకోర్టు బుధవారం నాలుగు వారాల జైలు శిక్ష, రూ. 2వేల జరిమానా విధించింది. దీనిపై అప్పీల్ దాఖలు చేసుకునేందుకు వీలుగా తీర్పు అమలును నిలుపుదల చేయాలన్న అడ్వకేట్ జనరల్ అభ్యర్థనపై ధర్మాసనం సానుకూలంగా స్పందించింది. తీర్పు అమలును నాలుగువారాల పాటు నిలుపుదల చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ సీవీ నాగార్జున రెడ్డి, చల్లా కోదండరాంలతో కూడిన ధర్మాసనం బుధవారం తీర్పు ఇచ్చింది. రంగారెడ్డి జిల్లా కుత్బుల్లాపూర్ మండలం సూరారం గ్రామ పరిధిలోని సర్వే నెంబర్ 107లో బలహీనవర్గాల కోసం నిర్మించిన గహ సముదాయాల్లో అనధికారికంగా నివస్తున్న 2300 మందిని ఖాళీ చేయించాలంటూ 2007, జూలైలో రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ హైకోర్టు తీర్పు ఇచ్చింది.
ఖాళీ చేయించే ప్రక్రియలో అధికారులకు తీవ్ర ప్రతిఘటన ఎదురుకావడంతో వారు అక్రమంగా నివాసం ఉంటున్నవారిని ఖాళీ చేయించలేకపోయారు. ఈ నేపథ్యంలో అధికారులు తమ నిస్సహాయతను వ్యక్తం చేస్తూ ఇళ్ల ఖాళీకి జారీ చేసిన తీర్పును పునః సమీక్షించాలంటూ అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు. అయితే కోర్టు ఈ పునః సమీక్ష పిటిషన్‌ను కొట్టేస్తూ అక్రమంగా నివాసం ఉంటున్నవారిని ఖాళీ చేయాల్సిందేనంటూ తేల్చి చెప్పింది. అయితే కోర్టు తీర్పు అమలు చేయడంలేదంటూ రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌పై కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలైంది. ఇందులో కౌంటర్ దాఖలు చేసిన కలెక్టర్ కోర్టు ఉత్తర్వుల అమలుకు గడువు కావాలని పలుమార్లు అభ్యర్థించారు. అయితే గడువు ఇచ్చినప్పటికీ నిర్ణీత సమయం లోపు అక్రమంగా నివాసం ఉంటున్న వారిని ఖాళీ చేయించలేకపోయారు. ఇది కోర్టు ఉత్తర్వులను ధిక్కరించడమేనని భావించిన ధర్మాసనం కలెక్టర్‌కు నాలుగువారాల జైలు, రూ. 2వేల జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించింది. ఈ సమయంలో అక్కడే ఉన్న అడ్వకేట్ జనరల్ కె రామకష్ణారెడ్డి ఈ తీర్పుపై తమ అప్పీల్‌ను దాఖలుచేస్తామని, అందువల్ల తీర్పు అమలును వాయిదా వేయాలని కోరారు. అందుకు ధర్మాసనం అంగీకరిస్తూ తీర్పు అమలును నాలుగువారాల పాటు వాయిదా వేసింది.