
జీవో 123 ఔట్
► రాష్ట్ర సర్కారుకు హైకోర్టులో ఎదురుదెబ్బ
► భూ సేకరణ చట్టం-2013కు ఈ జీవో విరుద్ధం
► బాధితుల హక్కులు, ప్రయోజనాలను హరిస్తోంది
► వ్యవసాయ కార్మికులకు చిల్లిగవ్వ కూడా దక్కడం లేదు..
► మెరుగైన పరిహారం ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది
► భూసేకరణ చట్టానికి విరుద్ధంగా నిబంధనలు
తెచ్చే అధికారం ప్రభుత్వానికి లేదని స్పష్టీకరణ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సాగునీటి ప్రాజెక్టులు, ప్రత్యేక ఆర్థిక మండళ్లు తదితరాల నిర్మాణం కోసం రైతుల నుంచి భూమి కొనుగోలు చేసేందుకు గత ఏడాది ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 123ని కోర్టు కొట్టేసింది. బాధితులకు కొత్త భూసేకరణ చట్టం కల్పిస్తున్న హక్కులు, ప్రయోజనాలను ఈ జీవో హరిస్తోందని తేల్చి చెప్పింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ సురేశ్ కైత్ బుధవారం తీర్పు వెలువరించారు. మెదక్ జిల్లా ఝరాసంగం మండలం ఎల్గోయ్, చీలపల్లి, బర్దీపూర్ గ్రామాల పరిధిలో నేషనల్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ మాన్యుఫాక్చరింగ్ జోన్ (ఎన్‌ఐఎంజెడ్) ఏర్పాటుకు అవసరమైన భూములను 2013 భూ సేకరణ చట్టం ప్రకారం కాకుండా జీవో 123 ప్రకారం సేకరిస్తుండటాన్ని సవాలు చేస్తూ బర్దీపూర్ గ్రామానికి చెందిన వ్యవసాయ కార్మికులు అల్గి తుక్కమ్మ, మరో 22 మంది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాన్ని బుధవారం న్యాయమూర్తి జస్టిస్ సురేశ్ కైత్ విచారించారు.
వ్యవసాయ కార్మికులు ఉపాధి కోల్పోతారు
పిటిషనర్ల తరఫు న్యాయవాది కె.ఎస్.మూర్తి వాదనలు వినిపిస్తూ.. ఎన్‌ఐఎంజెడ్ కోసం ప్రభుత్వం జీవో 123 ద్వారా వేల ఎకరాల భూమిని సేకరిస్తోందన్నారు. వ్యవసాయ కార్మికులైన పిటిషనర్లు ఈ భూములపైనే ఆధారపడి జీవిస్తున్నారని తెలిపారు. జీవో 123 ద్వారా ఆ భూములను సేకరిస్తే వారు తమ జీవనోపాధిని కోల్పోతారని వివరించారు. 2013 భూ సేకరణ చట్టంలోని సెక్షన్ 3(సీ) ప్రకారం వ్యవసాయ కార్మికులు కూడా ‘ప్రభావిత కుటుంబం’ నిర్వచన పరిధిలోకి వస్తారని చెప్పారు. ఈ చట్టం ప్రకారం పిటిషనర్లకు దక్కాల్సిన పునరావాస ప్రయోజనాలను దక్కకుండా చేస్తూ ప్రభుత్వం జీవో 214 జారీ చేసిందన్నారు. పార్లమెంట్ చేసిన చట్టాన్ని కాదని ప్రభుత్వం జీవో 123 జారీ చేసిందని, దీనివల్ల బాధితులకు ఏమీ దక్కే పరిస్థితి లేదని వివరించారు. కొత్త భూ సేకరణ చట్టం ప్రకారం బాధితులకు పరిహారం, పునరావాసం కల్పించాల్సిన బాధ్యతల నుంచి జీవో 123 ద్వారా ప్రభుత్వం తప్పించుకుంటోందన్నారు.
నష్టపోయిన రైతు ఒక్కరూ లేరు..
రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రత్యేక న్యాయవాది (ఎస్‌జీపీ) ఎస్.శరత్‌కుమార్ వాదనలు వినిపిస్తూ... జీవో 123 ద్వారా రైతుల నుంచి బలవంతంగా భూములను తీసుకోవడం లేదన్నారు. భూ సేకరణ చట్టం కింద రైతులకు దక్కుతున్న ప్రయోజనం కంటే జీవో 123 ద్వారానే అధిక ప్రయోజనం పొందుతున్నారని చెప్పారు. స్థానికంగా అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత.. ముందుకొచ్చిన రైతుల నుంచే భూములను కొనుగోలు చేస్తున్నామన్నారు. జీవో 123 వల్ల తమకు నష్టం జరిగింది ఇప్పటి వరకు ఏ ఒక్క రైతు కూడా చెప్పలేదన్నారు. అసలు పిటిషనర్ల భూములను ప్రభుత్వం సేకరించలేదని, వారికి జీవో 123 వల్ల ఎలాంటి నష్టం వాటిల్ల లేదని, అందువల్ల వారు ఈ వ్యాజ్యం దాఖలు చేయడానికి వీల్లేదని వివరించారు. దాదాపు 40 నిమిషాల పాటు ఇరుపక్షాల వాదనలను విన్న న్యాయమూర్తి జస్టిస్ కైత్ ప్రభుత్వ వాదనలతో విబేధించారు.
ప్రైవేటు ఆస్తుల డీలర్ కాదు
పిటిషనర్లు లేవనెత్తిన అంశాలను ప్రభుత్వం సరిగా అర్థం చేసుకోలేదని న్యాయమూర్తి జస్టిస్ సురేశ్ కైత్ అన్నారు. ప్రభుత్వం ప్రైవేటు ఆస్తులను సేకరించే డీలర్ కాదంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. భూ సేకరణ చట్టం-2103లో వ్యవసాయ కార్మికులు ‘ప్రభావిత కుటుంబం’ నిర్వచనం పరిధిలోకి వస్తారన్న విషయాన్ని గుర్తు చేశారు. ప్రభావిత కుటుంబం పరిధిలోకి వచ్చే వారికి కొత్త భూ సేకరణ చట్టం అనేక రకాల ప్రయోజనాలను కల్పిస్తోందన్నారు. బాధితులకు జీవో 123 ద్వారా మొదట పునరావాస ప్రయోజనాలు కల్పించిన ప్రభుత్వం.. ఆ తర్వాత వాటిని జీవో 214 ద్వారా హరించిందని తేల్చి చెప్పారు. జీవో 123 ద్వారా భూములు సేకరిస్తుండటంతో వ్యవసాయ కార్మికులకు చిల్లి గవ్వ కూడా దక్కడం లేదన్నారు. కొత్త భూ సేకరణ చట్టం ప్రకారం మెరుగైన పరిహారం, పునరావాసం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని స్పష్టంచేశారు. ఒకవైపు కొత్త భూ సేకరణ చట్టాన్ని ఆమోదించి, మరోవైపు దాన్ని అమలు చేయకపోవడం ఎంత మాత్రం సరికాదన్నారు. భూ సేకరణ చట్టానికి విరుద్ధంగా నిబంధనలు రూపొందించే అధికారం ప్రభుత్వానికి లేదని తేల్చిచెప్పారు. వ్యవసాయ కార్మికుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని జీవో 123 కొట్టేస్తున్నట్లు తన తీర్పులో ప్రకటించారు.