టీఆర్‌ఎస్ సభకు భారీ ఏర్పాట్లు
విలేకరులతో ఇష్టాగోష్ఠిలో తుమ్మల
సాక్షి, హైదరాబాద్: ఖమ్మంలో టీఆర్‌ఎస్ ఆవిర్భావసభను ‘న భూతో నభవిష్యతి’ అన్న రీతిలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తామని, ఖమ్మం జిల్లాను పూర్తిగా గులాబీమయం చేస్తామని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఖమ్మంలో టీఆర్‌ఎస్ సభ పెట్టడమంటే విజయవాడలో సభ పెట్టినట్టు అని ఆయన వ్యాఖ్యానించారు. అసెంబ్లీలో ఆయన ఆదివారం విలేకరులతో ఇష్టాగోష్ఠి గా మాట్లాడారు. సభ అంటే ఎలా ఉంటుందో చూపిస్తామని, భారీగా ఏర్పాట్లు చేయనున్నామని చెప్పారు. ఎమ్మెల్యే రాంరెడ్డి వెంకటరెడ్డి హఠాన్మరణంతో ఖాళీ అయిన పాలేరు నియోజకవర్గంలో అభ్యర్థిని పోటీకి పెట్టాలా.. వద్దా.. అనే విషయాన్ని పార్టీ నాయకత్వం నిర్ణయిస్తుందన్నారు.
మెదక్ జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలో పోటీ చేసి, పాలేరులో పోటీకి దూరంగా ఎలా ఉంటామన్నారు. రోడ్డు ప్రమాదాలు, నక్సల్ హింస వంటి సంఘటనల్లో చనిపోయినవారి విషయంలో ఆలోచించవచ్చుగాని, సాధారణ మరణంతో ఖాళీ అయిన స్థానాల్లో పోటీ లేకుండా ఎలా వదిలి పెడతారని వ్యాఖ్యానించారు. పాలేరులో తాను పోటీ చేస్తున్నానా, లేదా అంటూ జరుగుతున్న ప్రచారంపై తుమ్మల స్పందించారు. ‘ఎమ్మెల్సీ పదవీకాలం ఆరేళ్లకు సంబంధించింది. సీఎం ఇష్టాయిష్టాలను బట్టే ఏదైనా ఉంటుంది. ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన నాకు మూడు నెలల వ్యవధిలోనే పార్టీలో చేర్చుకుని మంత్రి పదవి కూడా ఇచ్చారు. ఎమ్మెల్సీగా గెలిపించారు. సీఎం ఏది చెబితే అది చేయడానికి సిద్ధంగా ఉన్నా..’ అని తుమ్మల నాగేశ్వరరావు వివరించారు.